మిగిలింది రెండ్రోజులే!

29 Aug, 2019 11:23 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ కమిటీలకు 31 డెడ్‌లైన్‌!

బూత్, డివిజన్, గ్రామ స్థాయి కమిటీలకు కేటీఆర్‌ ఆదేశం

సాక్షి, కరీంనగర్‌ : మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలమైన శక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియకు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు శ్రీకారం చుట్టారు. హైకోర్టులో మునిసిపల్‌ ఎన్నికల కేసు కొలిక్కి వస్తే ఏ క్షణమైన పుర, నగర పాలక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో బుధవారం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులతో హైదరాబాద్‌లో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 31లోగా అన్ని గ్రామాలు, డివిజన్‌లు, బూత్‌ల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జిలను నియమించారు. వీరి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పార్టీని అభివృద్ధి చేసే పనిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇన్‌చార్జిలు సమన్వయం చేసుకుంటారు. కాగా రెండు రోజుల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నేతృత్వంలో సాగనుంది. 

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ..
గత లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన మిశ్రమ ఫలితాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఈసారి పార్లమెంటు నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకొని, సంస్థాగత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కరీంనగర్‌లోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో బూత్‌స్థాయిలో పార్టీని అభివృద్ధి చేయడం, ప్రతి మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో పార్టీ గెలిచేలా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఇందుకోసం పార్లమెంటు ఇన్‌చార్జిలు స్థానిక ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఓడిపోయిన వారిని సమన్వయం చేసుకుంటారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోకి పలు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తుండగా, రెండు కార్పొరేషన్లు, 14 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు 31లోపు కమిటీలు ఏర్పాటు చేసేందుకు సర్వం సన్నద్ధమయ్యారు. 

పూర్తయిన సభ్యత్వం.. మ్మెల్యేల వద్ద కమిటీలు
పూర్వ కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయింది. ఈ నేపథ్యంలో ముందుగా మునిసిపాలిటీల పరిధిలోని బూత్, వార్డు, డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేలు నిర్ణయించారు. పూర్వ జిల్లాలో మంథని మినహా 12 సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. మంథని బాధ్యతను పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టా మధు చూస్తున్నారు. ఈ మేరకు మునిసిపాలిటీలకు సంబంధించి పూర్తిస్థాయిలో కమిటీలు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. 31 నాడు పలు నియోజకవర్గాల్లో కమిటీలు ప్రకటించే అవకాశం ఉంది. 

పార్లమెంటు ఇన్‌చార్జిలు వీరే!
పార్టీ స్థానిక కమిటీల నియామాకంతోపాటు మునిసిపల్‌ ఎన్నికలు లక్ష్యంగా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. 
పెద్దపల్లి: ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, అరికెల నాగేశ్వర్‌రావు, కర్ర శ్రీహరి, మూల విజయరెడ్డి
కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్, పోలీస్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్త, గుడూరి ప్రవీణ్,
నిజామాబాద్‌: పార్టీ ప్రధాన కార్యదర్శి తుల ఉమ, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరూక్‌ హుస్సేన్, లోక బాపురెడ్డి, రూప్‌సింగ్‌

మరిన్ని వార్తలు