అలకలు.. కినుకలు

10 Sep, 2019 03:01 IST|Sakshi

మంత్రి పదవిపై సీఎం మాట తప్పారన్న నాయిని

గన్‌మెన్లను వీడి అజ్ఞాతంలోకి జోగు రామన్న

పదవి అడిగే పరిస్థితి లేదంటూ రాజయ్య ఆవేదన

బీఏసీ నుంచి ఈటలను తప్పించారని ప్రచారం

అసెంబ్లీకి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి గైర్హాజరు

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రివర్గ విస్తరణతోపాటు చీఫ్‌ విప్, విప్‌ తదితర పదవుల పందేరం టీఆర్‌ఎస్‌లో కొత్త సమస్యలు సృష్టి స్తోంది. అసమ్మతి గళాలకు చెక్‌ పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ అనుసరించిన వ్యూహం మరిన్ని అసంతృప్త గళాలకు ఊపిరి పోస్తోంది. మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలతో పార్టీలో మొదలైన కలకలం మంత్రివర్గం విస్తరణ తర్వాత కూడా సద్దుమణగడం లేదు. ఆదివారం మొదలైన అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా తనకు ఎదురైన మీడియా ప్రతినిధు లతో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని సమాధానం చెప్పుకునే స్థితిలోకి నెట్టినట్లు కనిపిస్తోంది. తనను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా వారించిన సీఎం కేసీఆర్‌.. మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు అని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్‌ మాట తప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే వద్దన్నారు. కౌన్సిల్‌లో ఉండు. నీకు మంత్రి పదవి ఇస్తా అని అన్నాడు. మా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. నాకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి వద్దు. అందులో రసం లేదు. కేసీఆర్‌ మా ఇంటికి పెద్ద. మేమంతా ఓనర్లమే. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో, ఎప్పుడు దిగిపోతారో వాళ్లిష్టం’’ అంటూ నాయిని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య కూడా తనకు ఏ పదవీ దక్కే పరిస్థితి లేదని వాపోయారు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్‌లో స్థానం కల్పించక పోవడాన్ని మీడియా వద్ద ప్రస్తావించడంతోపాటు మాదిగ కుల సంఘాలు ప్రశ్నించాలనే రీతిలో సంకేతాలు ఇచ్చారు.

మంత్రివర్గ విస్తరణతో ఆశావహుల్లో నిరాశ
మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందని భావించిన కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం తమను కనీసం పిలిచి మాట్లాడక పోవడంపై అవేదన చెందుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించిన మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్‌ స్విఛాఫ్‌ చేయడంతోపాటు గన్‌మెన్లను కూడా వదిలి వెళ్లడంపై చర్చ జరుగుతోంది. తనకు తిరిగి మంత్రి పదవి లభిస్తుందనే ధీమాతో ఉన్న జోగు రామన్న మినిస్టర్‌ క్వార్టర్స్‌లోనే ఉంటున్నట్లు తెలిసింది. మంత్రి పదవిపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీతోనే మినిస్టర్‌ క్వార్టర్స్‌లో కొనసాగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం వెనుక కూడా అసంతృప్తే కారణమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటల వ్యాఖ్యలు సద్దుమణుగుతున్న వేళ తాజాగా అసెంబ్లీ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. ఈటల స్థానంలో కొత్త మంత్రి గంగుల కమలాకర్‌ హాజరు కావడంతో ఈటలకు చెక్‌ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఓవైపు బీజేపీ పదేపదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేతల అసమ్మతి రాగం ఎటు దారి తీస్తుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరిన్ని వార్తలు