జగదీష్...హల్‌చల్

29 Dec, 2014 02:50 IST|Sakshi
జగదీష్...హల్‌చల్

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్ మరింత పట్టు సాధించేదిశగా కీలక అడుగు పడబోతోంది. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన 15 మంది జెడ్పీటీసీలు, 15మంది ఎంపీపీలు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వీరంతా రేపోమాపో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీదళంలో చేరనున్నారు. ఈ మేరకు రెండు రోజులుగా క్రియాశీలకంగా జరుగుతున్న రాజకీయ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ పరిణామం వాస్తవమైతే అటు టీఆర్‌ఎస్‌తోపాటు ఇటు జిల్లా నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి రాజకీయంగా సరికొత్త బలాన్ని చేకూర్చనుంది. జెడ్పీచైర్మన్‌తోపాటు పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో చేరేందుకు తీసుకున్న నిర్ణయం మంత్రి జగదీష్‌రెడ్డికి జిల్లా రాజకీయవర్గాలపై పూర్తిస్థాయిలో పట్టు తెచ్చిపెడుతుందని రాజకీయ పరిశీలకులంటున్నారు.
 
 అధికారం... ఆందోళన
 వాస్తవానికి జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం చాలారోజుల నుంచి జరుగుతోంది. అయితే, ఆయన మాత్రం అటు పార్టీ మారాలా, లేక కాంగ్రెస్‌లోనే ఉండాలా అనే అంశంపై చాలా రోజులుగా తర్జనభర్జనలు పడుతున్నారు. అటు పూర్తిగా తన చేరికను ఖండిస్తూనే, ఇటు పార్టీ మార్పు అంశాన్ని సజీవంగా ఉంచుతూ ఆయన జాగ్రత్త తీసుకున్నారు. బాలు పార్టీ మారేందుకు కాంగ్రెస్‌లోని ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు కారణమని, వారి వైఖరి వల్లనే ఆయన పార్టీ మారుతున్నారని బాలునాయక్ వర్గీయులంటున్నారు. తన నియోజకవర్గంలో ఓ ముఖ్య నేత జోక్యం చేసుకుంటున్నారని, తన వర్గీయులను కూడా దూరం చేస్తున్నారనే ఆందోళనలో బాలునాయక్ ఉన్నారు.
 
 అదే విధంగా ఇటీవలి కాలంలో మరో రాష్ట్రస్థాయి నేత కూడా తనను దూరం పెడుతున్నారని బాలునాయక్ భావిస్తున్నారు. కొద్ది రోజులుగా మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి తన చేరికకు అంగీకరించి వచ్చారని సమాచారం. తన చేరిక కార్యక్రమం ఉండడంతో తాను చైర్మన్‌గా ఉన్న జెడ్పీ పనులు, ఆర్థిక రంగాలకు చెందిన స్థాయీసంఘాల సమావేశాలు సోమవారం జరగాల్సి ఉన్నా వాటిని వాయిదా వేసి మరీ మంగళవారం జరగనున్న కార్యక్రమాలపై బాలునాయక్ దృష్టి పెట్టడం గమనార్హం. మరోవైపు అధికార పార్టీలో ఉండడం ద్వారా అభివృద్ధికి అవకాశం ఉంటుందనే యోచనతో జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా అధికార పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
 
 జగదీష్...హల్‌చల్

 జిల్లా రాజకీయాలపై తన ముద్ర వేసుకునేందుకు మంత్రి జగదీష్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 1000 మందికి పైగా ప్రజాప్రతినిధులు (వార్డుమెంబర్ల నుంచి ఎమ్మెల్సీల వరకు) టీఆర్‌ఎస్‌లో చేరారంటేనే జగదీష్‌రెడ్డి పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నాలను అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలకు పట్టున్న జిల్లాగా పేరుగడించిన నల్లగొండ జిల్లాను గులాబీ కోటగా మార్చడంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల సహకారంతో జగదీష్‌రెడ్డి సఫలీకృతమవుతున్నారనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  
 

మరిన్ని వార్తలు