బలమైన శక్తిగా టీఆర్‌ఎస్‌ 

25 Jun, 2019 02:23 IST|Sakshi

మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి ఓ రికార్డు: కేటీఆర్‌  

32 జెడ్పీల్లో గులాబీ జెండా ఎగరడం మరో రికార్డు 

27 నుంచి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వాల నమోదు 

సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణానికి భూమి పూజ

సిరిసిల్ల: తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ అవతరించిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ 2001లో పార్టీ ప్రారంభించినప్పుడు ఈ స్థాయికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతోపాటు సీఎం కేసీఆర్‌ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించారని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అజేయమైన శక్తిగా నిలిచిందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి 32 జెడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం విశేషమన్నారు. ఈనెల 27 నుంచి టీఆర్‌ఎస్‌ సభ్యత్వాల నమోదు ఉంటుందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బూత్‌ కమిటీల నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తామన్నారు. పండుగ వాతావరణంలో సభ్యత్వాల నమోదు జరుగుతుందని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా తలపడతాం 
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతోనే కాదు దేవుడితోనైనా తలబడేందుకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. బీడు భూములకు సాగునీరు వస్తే సీఎం ఫొటో ప్రతీరైతు గుండెలో ఉంటుందని, ఆయన ఫొటోను పెట్టుకుని మొక్కేరోజులు వస్తాయన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచి అయిందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించి హరిత తెలంగాణ సాధిస్తామన్నారు. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.  

వస్త్ర పరిశ్రమను విస్తరించాలి 
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను విస్తరించాలని కేటీఆర్‌ కోరారు. సిరిసిల్ల పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొన్నారు. తమిళనాడులోని తిరువూరుకు దీటుగా కొత్త ఆలోచనలతో వస్త్రోత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత జౌళిశాఖకు రూ.70 కోట్లు ఉన్న బడ్జెట్‌ ఇప్పుడు తెలంగాణలో రూ.1,270 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. సిరిసిల్లలో అపెరల్‌ పార్కు నిర్మాణంతో 10 వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మరమగ్గాలు, చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌ చేశామని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమాల్లో వేములవాడ, చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితుల సమస్యలు సీఎంకు తెలుసు 
ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితుల త్యాగం మరువలేనిదని కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ నిర్మాణ పనులను కేటీఆర్‌ పరిశీలించారు. సొరంగం తవ్వకాలను ఆయన క్షేత్ర స్థాయిలో చూశారు. నిర్వాసితుల త్యాగాలతోనే ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని, కొందరి త్యాగం కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు