‘ట్రిపుల్‌ తలాక్‌’కు మేం వ్యతిరేకం!

28 Dec, 2018 01:28 IST|Sakshi

కేంద్రం తీరు  ఆక్షేపణీయమన్న టీఆర్‌ఎస్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ముస్లి మహిళల (వివాహ హక్కు రక్షణ) బిల్లు – 2018పై చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఈ సమయంలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టడం వెనక ప్రభుత్వ ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడే విషయంలో ఈ బిల్లు నిరంకుశంగా ఉందని జితేందర్‌ రెడ్డి విమర్శించారు. మైనారిటీల విశ్వాసాన్ని వమ్ముచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21లను ఉల్లంఘించేదిగా ఉందన్నారు. మత విశ్వాసాలను రాజ్యాంగ పరిధిలో విచారించడం న్యాయస్థానాల పని అని.. ఇకనైనా ఎన్డీయే ప్రభుత్వం మైనారిటీల విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు ఆయన పలికారు. లింగసమానతల విషయంలో టీఆర్‌ఎస్, పార్టీ అధినేత కేసీఆర్‌ స్పష్టతతో ఉన్నామని.. అయితే, ముస్లిం ల పురుషులకు మూడేళ్ల పా టు జైలుశిక్ష విధించాలన్న నిబంధనకు టీఆర్‌ఎస్‌ పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు.
 
కేబుల్‌ ఆపరేటర్ల డిమాండ్లపై.. 

మహబూబ్‌నగర్‌ కేబుల్‌ ఆపరేటర్స్‌ సంఘం చేసిన   డిమాండ్లను కేంద్రం తక్షణమే పరిష్కరించాలని సమాచార, ప్రసారశాఖ మంత్రిని జితేందర్‌రెడ్డి కోరారు. ఎంపిక చేసుకున్న చానెళ్లకే డబ్బులు చెల్లించాలన్న ట్రాయ్‌ నిబంధన ద్వారా కేబుల్‌ ఆపరేటర్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆపరేటర్లు చానళ్ల ప్రసారాల విషయంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినందున వారి సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.  ప్రసార కంపెనీలలబ్ధికే ట్రాయ్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని, వీటి ద్వారా కేబుల్‌ ఆపరేటర్లకు, వినియోగదారులకు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. టీవీ ప్రసార పరిశ్రమలో ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేలా మంత్రి చొరవతీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు