ఆచి.. తూచి.. అడుగులు

1 Oct, 2018 13:21 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి (వరంగల్): జిల్లాలో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కార్యకర్తలతో పాటు నాయకులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ప్రతీసారి ఎన్నికల ముందు వలసల ఉధృతి ఉంటుంది. వివిధ పార్టీల్లో చేరేవారు.. వెళ్లే వారితో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈసారి జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అడపాదడపా చేరికలు జరుగుతున్నా పెద్దగా ప్రభావం చూపించే స్థాయిలో లేవు. అధికార పార్టీలోని అసంతృప్త నేతలు సైతం కొంత ప్రా భల్యం కలిగి ఉండడంతో వారు వేరే పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపడంలేదు. కార్యకర్తలు సైతం వారినే అంటిపెట్టుకుని ఉండడంతో వలసలకు అవకాశం లేకుండా పోయింది.

రాష్ట్ర అసెంబ్లీ రద్దయి 25 రోజులు గడిచింది. అయినప్పటికీ జిల్లాలో చెప్పుకోదగిన రీతిలో వలసలు కనిపించడంలేదు. గ్రామపంచాయతీ ఎన్నికల ముందు నమోదైన వలసలతో పొల్చితే అసెంబ్లీ ఎన్నికల ముందు వలసలు అధికంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు ఊహించినా ఆ స్థాయిలో లేవు. కార్యకర్తలు, నాయకులు అందరూ గోడమీద పిల్లుల మాదిరిగా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్‌ఎప్‌ పార్టీ మినహా ఇతర ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులపై స్పష్టత ఇవ్వలేదు. ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకపోవడంతో పార్టీలు మారాలనుకున్న చాలా మంది ఆలోచనలో పడ్డారు. అభ్యర్థుల ప్రకట న తర్వాతే బలాబలాలను బేరీజు వేసుకుని పార్టీ మారడమా? లేక ఉన్నదాంట్లోనే కొనసాగడమా? అనేది నిర్ణయించుకోవడానికి వేచిచూస్తున్నారు.

అసమ్మతి ఉన్నా.. పటిష్టమే..
జిల్లాలోని ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో అధికార పార్టీ టికెట్లు ప్రకటించిన తర్వాత అసమ్మతి బెడద పెరిగింది. చందూలాల్‌కు ములుగు నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ప్రకటించగా.. ఏజెన్సీ ప్రాంతం కావడం.. ఆదివాసీల ప్రాభల్యం అధికంగా ఉండడంతో వారికే అవకాశం కల్పించాలని ఆ పార్టీకి చెందిన అసమ్మతి నేతలు పట్టుపడుతున్నారు. అంతేకాకుండా మంత్రిగా ఉన్న చందూలాల్‌ తమను పట్టించుకోలేదని, ఆయన కుమారుడి అరాచకాలతో వేగలేకపోతున్నామని.. అభ్యర్థిని మార్చాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. తమలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిపించుకుంటామని.. పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ములుగు కాంగ్రెస్‌లో ప్రస్తుతం రెండు వర్గాలు ఉన్నాయి. పొదెం వీరయ్య, సీతక్క నాయకత్వాల వారీగా విడిపోయి కాంగ్రెస్‌ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి స్తబ్ధుగా ఉన్నా పార్టీ నుంచి టికెట్‌పై స్పష్టత వచ్చిన తర్వాత అసంతృప్తులు వేరే పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ఇక భూపాలపల్లి విషయానికి వస్తే టీఆర్‌ఎస్‌ టికెట్‌ స్పీకర్‌ మధుసూదనాచారికి కేటాయించగా.. అదే పార్టీలోని నాయకుడు గండ్ర సత్యనారాయణరావు టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో రెబల్‌గా బరిలో ఉంటానని స్పష్టంచేసి ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి తమ నాయకుల వెంటే ఉంటున్నారు. మిగతా పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోయినా కాంగ్రెస్, బీజేపీ తరఫున గండ్ర వెంకటరమణారెడ్డి, కీర్తిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నా ఆయా పార్టీల్లో పెద్దగా చేరికలు కనిపించడంలేదు.

పుకార్లతో పరేషాన్‌..
ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా పరిధిలోని మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం నియోజకవర్గాల్లో ఏ పార్టీకి సీటు కేటాయిస్తారనే విషయంపై స్పష్టత రాకపోవడం పార్టీ మారాలనుకునే వారిని డైలామాలో పడేసింది. ఉదా హరణకు మంథని నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్‌ నాయకు డు శ్రీధర్‌బాబు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో తాను మంథని నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరి ణామాలతో నాయకులు సైతం ఎందుకైనా మంచిదని టికెట్లపై క్లారి టీ కోసం ఎదురుచూస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని కాటా రం, మహాముత్తారం, మహదేవపూర్‌ మండలాల్లో టీఆర్‌ఎస్, కాం గ్రెస్‌ పార్టీల్లోని కార్యకర్తలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మారుతున్నారు. అయితే ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా అభ్యర్థుల ప్రకటన తర్వాతే వలసల జోరు కనిపించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు