‘ఫిరాయింపుల’ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

17 Mar, 2019 02:16 IST|Sakshi

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌

అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలి

సీఎం కేసీఆర్‌ బరి తెగించి వ్యవహరిస్తున్నారు

మా పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం హేయం

ఈ పరిణామం ప్రజాస్వామ్యానికే ప్రమాదం

అవినీతి బయటపడుతుందనే ప్రతిపక్షం లేకుండా సీఎం కుట్ర

18న గవర్నర్‌ను కలుస్తాం.. 19 నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తా 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుమారుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రమారావు ఆడుతున్న వింత నాటకం విచిత్రంగా, జుగుప్సాకరంగా, అత్యంత నీచంగా, హేయంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగమని, కానీ కేసీఆర్‌ మాత్రం స్వతంత్ర రాజులాగా, ఇక్కడ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం లేదనే రీతిలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని భట్టి ఆరోపించారు. ఈ పోకడ రాష్ట్రంతోపాటు దేశానికే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో కలసి భట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని చేసిన ప్రమాణాన్ని సీఎం తుంగలో తొక్కారని, రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పాలన సాగడం లేదని భట్టి ఆరోపించారు.

తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి కేసీఆర్‌ ఆహ్వానించడం, అందుకు అనుగుణంగా వారు ప్రకటనలు చేయడం అత్యంత హేయమని, నీచమని మండిపడ్డారు. సీఎం బరితెగించి వ్యవహరిస్తున్న తీరును చూస్తూ ఊరుకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. ప్రతిపక్షాన్ని సభలో లేకుండా చేయాలని కోరుకుంటున్న కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. రీ డిజైనింగ్‌ పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథలో చేసిన అవినీతి గురించి ప్రతిపక్షం ప్రశ్నిస్తే పార్టీకి, కుటుంబానికి ఇబ్బందిగా మారుతుందని భావించి ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్రకు పాల్పడుతున్నారని భట్టి ఆరోపించారు.

దేశస్థాయి సంస్థలు కూడా విచారణ జరిపే అవకాశం లేకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించే స్థాయిలో లేకుండా ఉండేందుకు లోక్‌సభలో సంఖ్య కోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇందిరా సాగర్, రాజీవ్‌ సాగర్, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సభలో పెట్టాలని తాము అడిగామని, తీగ లాగితే డొంక ఎక్కడ కదులుతుందో అనే భయంతోనే ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, భయపెట్టి, డబ్బుతో లొంగదీసుకున్నా తాము ప్రశ్నించబోమని, ప్రభుత్వ అవినీతిని బయటపెట్టబోమని కేసీఆర్‌ అనుకోవడం పొరపాటేనని భట్టి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ కేసీఆర్‌పై యుద్ధం చేస్తూనే ఉంటుందన్నారు.  

అభివృద్ధి కోసం వెళ్తున్నారా? 
పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భట్టి విమర్శించారు. పార్టీ మారుతున్నామని ప్రకటిస్తున్న ఎమ్మెల్యేలు విడుదల చేసే లేఖలన్నీ ప్రగతి భవన్‌లో తయారవుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్‌ను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్న కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎమ్మెల్యేలు గెలిచేందుకు అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్‌ కార్యకర్తల త్యాగాలను కేసీఆర్, కేటీఆర్‌లకు అమ్ముకోవడం నీచమని మండిపడ్డారు.

ఈ వ్యవహారాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని వ్యాఖ్యానించారు. పార్టీలో భరోసా లేకనే వెళుతున్నారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పార్టీపై భరోసా లేకపోతే ఎన్నికల్లో తమకు చేయి గుర్తు కావాలని ఎందుకు అడిగారని, భరోసా లేకుండానే కాంగ్రెస్‌ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచారా అని భట్టి ఎదురు ప్రశ్నించారు. వారేమీ చిన్నపిల్లలు, మైనర్లు కాదని, 2 లక్షలకుపైగా ఓటర్లకు ప్రతినిధులుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి... 
రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని, పరిస్థితి శ్రుతి మించిపోయిందని భట్టి పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని, లేదంటే తప్పు చేసిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను కేబినెట్‌లోకి తీసుకున్నప్పుడే గవర్నర్‌ అడ్డుకొని ఉంటే ఇంతటి దారుణ పరిస్థితులు ఏర్పడి ఉండేవి కావని, ఇప్పటికైనా గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని భట్టి కోరారు. ఈ నెల 18న కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న వికృత చర్యలపై ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నా, మాట్లాడాల్సిన వారు మాట్లాడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఆగడాలపై దశలవారీగా ఉద్యమిస్తామన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి సీఎల్పీ నేతగా తాను రాష్ట్రమంతటా పర్యటిస్తానన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ముందుగా వెళతానని, ఆ తర్వాత రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు. అన్ని పార్టీల జాతీయ నేతలను కలుస్తామని, అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలసి పరిస్థితిని వివరిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు