పొత్తులేదు: తేల్చేసిన కేసీఆర్

16 Mar, 2014 01:30 IST|Sakshi
పొత్తులేదు: తేల్చేసిన కేసీఆర్

 ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
 జైరాం రమేశ్, దిగ్విజయ్‌సింగ్
 అవమానకరంగా వ్యవహరించారు
 టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌వారు వస్తారో, టీఆర్‌ఎస్‌వాళ్లు కాంగ్రెస్‌లోకి పోతారో చూద్దాం
 పొన్నాల కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు
 టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు

 
 సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టంచేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు శనివారం కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పట్ల కాంగ్రెస్ నాయకులు అవమానకరంగా వ్యవహరించారని విమర్శించారు. ‘‘టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటరు. మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరాలని అంటరు. స్నేహం చేయాలనుకునేవారు ఇలాగే ఉంటరా? కలిసి పోదాం అని అనుకుంటే ఒక పద్ధతి ఉంటది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. విలీనం, పొత్తు వద్దని పార్టీ నేతలు అందరూ కోరారు. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని పొత్తులకోసం కేకే నాయకత్వంలో ఒక కమిటీని వేసినం. జైరాం రమేశ్, దిగ్విజయ్‌సింగ్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నరు. ఇప్పుడు అధికారికంగా చెబుతున్నా. పొత్తులు ఉండవు. ఇప్పటిదాకా చాలా సహనంగా ఉన్నం. రేపటి నుంచి చూద్దాం. టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ వారు వస్తారో, కాంగ్రెస్‌లోకి టీఆర్‌ఎస్‌వారు వెళ్తారో చూద్దాం’’ అని కేసీఆర్ సవాల్ చేశారు.

కేసీఆర్ మోసం, ద్రోహం చేశాడని పొన్నాల లక్ష్మయ్య చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏం మోసం చేసిన. సీమాంధ్ర ప్రభుత్వాల్లో మంత్రిగా ఉంటూ... కేటాయింపులు లేకపోయినా అక్రమ ప్రాజెక్టులపై సంతకం పెట్టిందే పొన్నాల లక్ష్మయ్య. ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యమకారులే పొన్నాల వంటివారి పేర్లు రాసి ఆత్మ బలిదానం చేసుకున్నరు. ఇప్పుడు అమరుల కుటుంబాలకు టికెట్లు ఇస్తామంటరా? ఉద్యమాల్లో జైలుకు పోయిన విద్యార్థులను బెయిలుపై తీసుకురావడానికే ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్లుగా ఉన్నయి. ఇప్పుడు ద్రోహం, మోసం అంటడా? పొన్నాల కళ్లు నెత్తికెక్కి మాట్లాడ్తున్నడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
     ద్రోహం చేసిందే కాంగ్రెస్
 
     తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘‘తెలంగాణలో ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను పంపించాలని కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్‌టీఆర్ తెచ్చిన జీఓలను అమలు చేయలేదు. అప్పటినుండి ఇప్పటిదాకా అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగినయి. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందనే కొట్లాట జరుగుతున్నది. ఈ కొట్లాటలో జైళ్లకు పోయినవారు ఉన్నరు. ఎన్నో త్యాగాలు చేసిన నాయకులున్నరు. ప్రజలు కోరుకున్న తెలంగాణను తయారు చేసుకోవడానికి, తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉన్న పార్టీ ఉండాల్నని చాలామంది కోరుతున్నరు. అయినా పొత్తులకోసం ఒక కమిటీని వేసినం. మర్యాదగా ఉంటారేమోనని చూసినం. అయినా కాంగ్రెస్ పార్టీ నేతలు ద్రోహం చేసిన అని నోటికొచ్చినట్టుగా మాట్లాడ్తున్నరు. ఏం ద్రోహం చేసిన. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వయలార్ రవి, మరికొందరు పెద్దలతో మాట్లాడిన. ఇంకెంతమంది విద్యార్థులను పొట్టన బెట్టుకంటరు? రాజకీయ అవసరాలే మీకు ముఖ్యమైతే పార్టీని కూడా విలీనం చేస్త తెలంగాణ ఇవ్వాలని అడిగిన. దీనిపై నాలుగైదు సార్లు ఢిల్లీలో వయలార్ రవిని, మరో పెద్దాయనను కలిసిన. నెల రోజులు చూసిన. తెలంగాణ ఇవ్వలేదు. ఛీ.. ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పార్టీ అని కరీంనగర్‌లో సమావేశం పెట్టుకున్నం. తెలంగాణ రావాలంటే 15 ఎంపీలు, 100 ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలని అనుకున్నం. చివరిలో ఇప్పుడు తెలంగాణ ఇచ్చిండ్రు. దీనిలోనూ చాలా సమస్యలున్నయి. మంచిగా లేదు అని ప్రధానమంత్రికి, జీవోఎంకు, జైరాం రమేశ్‌కు, దిగ్విజయ్‌సింగ్‌కు కూడా చెప్పిన. జనాభా ప్రకారం ఉద్యోగాలు, జనాభా నిష్పత్తి ప్రకారమే పెన్షన్లు అని పంపకాలు చేస్తరట. ఇప్పటిదాకా దోచుకున్న సీమాంధ్రకే జాతీయ ప్రాజెక్టు అట. వీటిపై తెలంగాణ నాయకులు మాట్లాడలేదు’’ అని ఆయన విమర్శించారు.
 
 గాడిదకు గడ్డి.. ఆవుకు పాలా?
 
 ‘‘తెలంగాణ రాగానే పని అంతా అయిపోయినట్టు కాదు. జాతీయ ప్రాజెక్టులకోసం, నిధులకోసం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడాలె. దీనికోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలవాలె. కొట్లాడేవారికే కత్తి ఇయ్యాలె. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయాలంటే ఎట్లా? పాలు కావాలంటే ఆవుకే మేత పెట్టాలె. గాడిదకు గడ్డి పెట్టి ఆవు దగ్గర పాలు పిండుతరా? తెలంగాణకోసం కొట్లాడే స్వీయ రాజకీయ అస్తిత్వమున్న టీఆర్‌ఎస్‌ను ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించాలి’’ అని కేసీఆర్ కోరారు. కార్యక్రమంలో ఎంపీ జి.వివేక్, టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు