నేటి నుంచి టీఆర్‌ఎస్ శిక్షణాశిబిరం

2 May, 2015 04:27 IST|Sakshi
నేటి నుంచి టీఆర్‌ఎస్ శిక్షణాశిబిరం

హైదరాబాద్/నాగార్జునసాగర్: టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులకు వివిధ అంశాల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన శిక్షణ కార్యక్రమం శనివారం మొదలుకానుంది. ఇందుకోసం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణకు సాగర్‌లోని విజయ్‌విహార్ ముస్తాబైంది. శిక్షణ వేదికను సుందరంగా అలంకరించారు. శిక్షణ తరగతులను ఎమ్మెల్సీ పల్లా రాజ్వేర్‌రెడ్డి, వేణుగోపాలాచారి పర్యవేక్షిస్తారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇక్కడికి చేరుకున్నారు. మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విజయవిహార్‌లో, మిగిలిన వారికి జెన్‌కో అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు.


మధ్యాహ్నమే ఇక్కడికి చేరకుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి జెన్‌కో అతిథి గృహం, విజయవిహార్‌లోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. సోమవారం మధ్యాహ్నానికి జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మేయర్లు హాజరవుతారు. శనివారం ఉదయం 10 గంటలకు శిక్షణ ప్రారంభమవుతుందని టీఆర్‌ఎస్ ఒక ప్రకటన లో పేర్కొంది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ఎన్నికల మాజీ ప్రధానాధికారి జె.ఎం.లింగ్డో, ప్రొఫెసర్ సీహెచ్ హన్మంతరావు, ఆస్కి డెరైక్టర్ జనరల్ రవికాంత్ పాల్గొంటారు. తొలి రోజు ప్రజాస్వామ్యం, గుడ్ గవర్నెన్స్, గ్రీన్ కవర్ అంశాలపై, రెం డో రోజున పరిశ్రమలు, గనులు, ఐటీ అంశాలపై ఆయా రంగాల్లో నిపుణులు శిక్షణ ఇస్తారని పార్టీ వెల్లడించింది. 


చివరిరోజు రాజ కీయ అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపింది. శిక్షణబాధ్యతను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(అస్కీ)కి అప్పజెప్పిన విషయం తెలిసిందే. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, చట్టసభలు, ఆర్థిక వనరులు, బడ్జెట్, ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు వంటి పది అంశాల్లో  శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచా రు. టీఆర్‌ఎస్ జారీ చేసిన గుర్తింపుకార్డులు ఉన్నవారినే లోపలికి అనుమతించారు.

మరిన్ని వార్తలు