బీసీ మంత్రం 

25 Oct, 2018 12:56 IST|Sakshi

జిల్లాలో ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రారంభ మయ్యాయి. అభ్యర్థులు రెండు నియోజకవర్గాల్లో అధికంగా ఉన్న బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమకు మద్దతిస్తే అండగా ఉంటామని ‘ప్రత్యేకంగా హామీలుస్తున్నారు. సగానికంటే ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, మెదక్‌: జిల్లాలో ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు కుల సమీకరణాలపై దృష్టి సారించారు.   నియోజకవర్గంలో గెలుపు, ఓటములను ప్రభావితం చేసే సామాజికవర్గాలను తమవైపు తిప్పకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపుకోసం కుల సంఘాలను మచ్చిక చేసుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.   మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ఓటర్లు ఎన్నికల్లో ప్రభావితం చేయనున్నారు.

దీంతో  కులాల వారిగా ఓటర్ల వివరాలు సేకరించి వారి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా బీసీ ఓటర్లపై అన్ని రాజకీయ పార్టీలు గురి పెట్టాయి. రెండు నియోజకవర్గాల్లో బీసీ ఓటర్ల శాతం ఎక్కువ.  ఈ ఎన్నికల్లో  వారు అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో బీసీ ఓట్లకు గాలం వేస్తున్నారు. ఎలాగైనా బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కుల సంఘాలతో అభ్యర్థులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తమ పార్టీకి ఎన్నికల్లో మద్దతు ఇస్తే కుల సంఘాలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీలు గుప్పిస్తున్నారు.

ప్రత్యేక సమావేశాలు..
మెదక్‌ నియోజకవర్గంలో 1,93,141 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 80 వేలకుపైగా బీసీ ఓటర్లు ఉంటారని అంచనా.  బీసీల్లో అత్యధికంగా ముదిరాజ్, గౌడ్, మున్నూరుకాపు, యాదవులు, పద్మశాలి, నాయిబ్రాహ్మణ, రజక కులాల ఓటర్లు ఉన్నారు. 12.5 శాతం మేర ముదిరాజ్‌లు, 8 శాతం మేర గౌడ్‌ కులస్తులు, మున్నూరు కాపు 5 శాతం  ఉన్నారు. మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కుల సంఘాల పెద్దలతో ఇప్పటికే సమావేశం అవుతున్నారు. రామాయంపేట, చిన్నశంకరంపేట, హవేళిఘనపూర్‌ మండలాల్లోని బీసీ కుల సంఘాలతోనూ ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

బుధవారం ఏడుపాయల్లో మెదక్‌ నియోజకవర్గంలోని గొల్ల, కుర్మ సంఘం నాయకులతో జెడ్పీచైర్‌పర్సన్‌ రాజమణిమురళీయాదవ్, టీఆర్‌ఎస్‌ నాయకుడు దేవేందర్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ సమావేశంలో కోరారు. మెదక్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న బీసీ నేత బట్టి జగపతి బీసీ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఆశావహులు శశిధర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, బాలకృష్ణ తదితరులు కూడా ఒక్కొక్కరు బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం అవుతున్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థి దూడ యాదేశ్వర్‌ సైతం గ్రామాల్లో పర్యటిస్తూ బీసీ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. ఇలా ఎవరికివారే బీసీలను తమవైపు లాగే ప్రయత్నం చేస్తున్నారు.

అండగా ఉంటాం..
ఇక నర్సాపూర్‌ నియోజకవర్గంలోనూ బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువే. నియోజకవర్గంలో మొత్తం 1,99,465 ఓటర్లు ఉన్నారు. ఇక్కడా కూడా దాదాపుగా 80 వేల పై చిలుకు బీసీ ఓటర్లు ఉన్నారు. బీసీల్లో ప్రధానంగా ముదిరాజ్‌లు 20వేలు, యాదవులు 15వేలు, గౌడ కుల ఓటర్లు 10వేలు, పద్మాశాలీలు 7వేలు, నాయా బ్రాహ్మణులు 3వేలు, మున్నురు కాపు 3వేలకుపైగా ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్‌  అభ్యర్థి మదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పోటీలో దిగనున్న సునీతారెడ్డి ప్రయత్నిస్తున్నారు.

కుల సంఘాలతో సమావేశమై తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బీసీ నేత మురళీయాదవ్‌ ద్వారా బీసీల ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని, ఎన్నికల్లో గెలిపిస్తే బీసీలకు మరింత న్యాయం చేస్తామని మదన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.   టీఆర్‌ఎస్‌లోని బీసీ నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన హత్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని సునీతారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు