టీఆర్‌ఎస్‌ నుంచి మహిళలకు దక్కని టికెట్లు

12 Sep, 2018 08:59 IST|Sakshi

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొండిచేయే..

గత ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ సీటు కేటాయింపు 

ఈసారి అక్కడ కూడా కోతే.. 

మల్కాజిగిరి నుంచి కార్పొరేటర్‌ విజయశాంతి ఆసక్తి 

పోటీకి వస్తున్న మైనంపల్లి హన్మంతరావు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) టికెట్ల కేటాయింపులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళలకు మొండిచేయి చూపింది. కనీసం ఒక్కరికి కూడా టికెట్‌ ఇవ్వకుండా నిరాశ మిగిల్చింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికారి పార్టీ ఒక మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించగా.. ఈసారి ఆ అభ్యర్థిత్వానికి కూడా కత్తెర పెట్టింది. రాజేంద్రనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి  బరిలో నిలిచారు. ఆమెపై టీడీపీ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ విజయం సాధించారు.

అనంతరం రాజకీయ సమీకరణలతో ప్రకాశ్‌గౌడ్‌ను టీఆర్‌ఎస్‌ అక్కున చేర్చుకుంది. తాజా ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్టును ఖరారు చేసింది. దీంతో స్వర్ణలత ఆశలపై నీళ్లుజల్లినట్లయింది. టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ, సిట్టింగ్‌ శాసనసభ్యుడు కావడంతో ప్రకాశ్‌ను అదృష్టం వరించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఇందులో ఇప్పటివరకు వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి మినహా మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ ప్రకటించింది.  

వస్తే.. గిస్తే.. 
మహిళా కోటాలో ఎవరికైనా టికెట్టు ఇవ్వాలని గులాబీ అధినాయకత్వం భావిస్తే కేవలం పెండింగ్‌ సీట్లలోనే ఇవ్వాల్సివుంటుంది. వికారాబాద్, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో అతివలెవరూ టికెట్టును ఆశించడం లేదు. కేవలం మల్కాజిగిరిలో మాత్రం అల్వాల్‌ కార్పొరేటర్‌ విజయశాంతి బరిలో దిగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి ఈ సారి టికెట్టు ఇవ్వకపోవడంతో ఆయన స్థానంలో విజయశాంతిని సర్దుబాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ స్థానం నుంచి పోటీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్థానికుడు కావడం.. గ్రేటర్‌ అధ్యక్ష హోదాలో టికెట్టు ఖరారు చేయాలని మైనంపల్లి కోరుతుండడంతో అధిష్టానం ఈ సీటుపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. మహేశ్వరం సీటు కోసం పట్టుబట్టిన తీగల అనితారెడ్డి తన మామ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి టికెట్టు ఖరారు కావడంతో మిన్నకుండిపోయారు.  

కాంగ్రెస్‌లో చెల్లెమ్మనే దిక్కు!
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రమే కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. మహిళా కోటాలో కూడా ఆమెకే టికెట్టు ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2009 వరకు చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆమె.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కుమారుడు కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్టు కోసం సిట్టింగ్‌(మహేశ్వరం) స్థానాన్ని త్యజించారు. ఈ సారి మాత్రం మహేశ్వరం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే మహిళ కూడా సబిత ఒక్కరే అయ్యే ఛాన్స్‌ ఉంది. రాజేంద్రనగర్‌ సీటుపై గంపెడాశ పెట్టుకున్న మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సదాలక్ష్మి.. తన పేరును పరిశీలించాలని, స్థానికేతరులకు టికెట్టు ఇవ్వకూడదని డిమాండ్‌ చేస్తున్నారు.

కమలంలో సుమతి! 
భారతీయ జనతా పార్టీలోనూ కేవలం ఒకరిద్దరు ఆశావహులు మాత్రమే ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉప్పరిగూడ మాజీ సర్పంచ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి సుమతీ అర్జున్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. మహిళా కోటాలో తమకు సీటు కేటాయించాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. ఇదే పార్టీ తరఫున మహేశ్వరం నుంచి రాధ ధీరజ్‌రెడ్డి కూడా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి అమృతాసాగర్‌ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీచేయడానికి పావులు కదుపుతున్నారు. కాగా, పార్టీకి ఒకరిద్దరు తప్ప ఆశావహులు కూడా లేకపోవడంతో మహిళల ప్రాతినిథ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు