టీఆర్‌ఎస్‌కు అరుదైన విజయం

17 Feb, 2016 03:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సానుభూతి పవనాలతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిన నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది కూడా ఏకంగా 53 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం అరుదైన విజయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. తమ సిట్టింగ్ స్థానమైన ఇక్కడ కిష్టారెడ్డి కుమారుడినే బరిలోకి దింపితే సానుభూతి పవనాలతో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు మంత్రి హరీశ్‌రావు పన్నిన వ్యూహం విజయవంతమై.. గులాబీ జెండా ఎగిరింది. ఈ ఉప ఎన్నికలో 50 వేల మెజారిటీ సాధిస్తామని నామినేషన్ల రోజే చెప్పిన హరీశ్‌రావు... అదే రీతిన ప్రచారం నిర్వహించి అనుకున్నది సాధించారు. మధ్యలో రెండు రోజులు మినహా నారాయణఖేడ్‌లోనే బసచేసి ఊరూరా తిరిగారు. నారాయణఖేడ్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానని మాటిచ్చి ప్రజల మద్దతు కూడగట్టారు.

 సానుభూతిని అధిగమించి..
 ఇప్పటివరకు ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన దాదాపు అన్ని ఉప ఎన్నికల్లోనూ ఆయా పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. సానుభూతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తుంటాయి. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ పార్టీ అదే పని చేసింది. కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చింది. గత 30 ఏళ్లలో ఇలా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే విజయం సాధించారు. కానీ ఇప్పుడు నారాయణఖేడ్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. అంతేకాదు కాంగ్రెస్‌పై భారీ ఆధిక్యం సాధించడాన్ని రాజకీయ పరిశీలకులు అరుదైన విజయంగా అభివర్ణిస్తున్నారు.

మరిన్ని వార్తలు