వారంలో టీఆర్‌టీ సవరణ నోటిఫికేషన్‌!

25 Nov, 2017 01:25 IST|Sakshi

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు కసరత్తు

విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష

పాత జిల్లాల వారీగా పోస్టుల భర్తీ

పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్‌ వివరాలుసిద్ధం చేయాలని ఆదేశం

దరఖాస్తుల ఫార్మాట్‌లో మార్పులు..

ఇప్పటికే దరఖాస్తు చేసినవారికి ‘ఎడిట్‌’ ఆప్షన్‌

గడువు వచ్చే నెల 15 వరకు పెంచే అవకాశం!  

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత పది జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఆర్‌టీ నోటిఫికేషన్‌ సవరణ చేయాలని.. పాత జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేయాలని విద్యా శాఖను ఆదేశించింది. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాల ఆప్షన్‌ను ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించ నున్నారు. కొత్తగా దరఖాస్తు చేసేవారికి పాత పది జిల్లాల ఆప్షన్లే వచ్చేలా మార్పులు చేయనున్నారు. వారం రోజుల్లో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశముంది.

దరఖాస్తుల గడువును కూడా వచ్చే నెల 15వ తేదీ వరకు పొడిగించనున్నట్లు సమాచారం. 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత నెల 21న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే నెల 30వ తేదీ నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అయితే ఈ నోటిఫికేషన్‌ను 31 కొత్త జిల్లాల ప్రాతిపదికన జారీ చేశారని, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 10 జిల్లాల వారీగా భర్తీ చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు పాత జిల్లాల ప్రకారమే నియామకాలు చేపట్టాలని శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. పాత పది జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

జిల్లా ఆప్షన్‌లో ‘ఎడిట్‌’కు అవకాశం
టీచర్‌ పోస్టుల దరఖాస్తుల్లో అభ్యర్థుల స్థానికతకు సంబంధించి 31 జిల్లాలను పొందుపరిచారు. అభ్యర్థులు తాము పుట్టిన ప్రదేశం ప్రకారం కొత్త జిల్లాను ఎంచుకున్నారు. తాజాగా పాత జిల్లాలే ప్రాతిపదిక అని హైకోర్టు స్పష్టం చేయడంతో దరఖాస్తుల్లో మార్పులు చేయాల్సి ఉంది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ‘ఎడిట్‌’ఆప్షన్‌ ఇచ్చి.. పాత జిల్లాల లెక్కన తమ జిల్లాను ఎంచుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా నోటిఫికేషన్‌లో మార్పు ఉండకపోవచ్చని.. సవరణ ద్వారా పాత పది జిల్లాల ప్రకారం పోస్టులు, రోస్టర్, రిజర్వేషన్‌ వివరాలను తెలియజేస్తే సరిపోతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం 31 జిల్లాల ఫార్మాట్‌ స్థానంలో పాత 10 జిల్లాలను అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో.. దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల 15 వరకు పొడగించే అవకాశముంది. మరోవైపు 31 జిల్లాలతో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కొత్త రోస్టర్‌ను ఒకటో పాయింట్‌ నుంచి ప్రారంభించారు. కానీ పాత జిల్లాల లెక్కన భర్తీతో పాత రోస్టర్, రిజర్వేషన్లనే కొనసాగించనున్నారు.

పలు జిల్లాల వారికి ప్రయోజనం
కొత్త జిల్లాల లెక్కన చూస్తే.. ఏడు జిల్లాల్లో ఎస్జీటీ వంటి కొన్ని కేటగిరీల పోస్టులే లేవు. మరో 8 జిల్లాల్లో ఏజెన్సీ పోస్టులను మినహాయిస్తే ఎస్జీటీ పోస్టులు 11లోపే ఉన్నాయి. అంటే సాధారణ అభ్యర్థుల విషయంలో 15 జిల్లాల్లో పోస్టులు దాదాపుగా లేనట్లే. మరో మూడు జిల్లాల్లోనూ 50లోపే పోస్టులు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా పాత జిల్లాల లెక్కన భర్తీ చేపట్టనుండడంతో.. ఆయా జిల్లాల ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రయోజనం కలుగనుంది. ముఖ్యంగా పోస్టులు లేని పట్టణ జిల్లాలకు చెందినవారికి ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. పాత జిల్లాల ప్రకారం వివిధ కేటగిరీల్లోనూ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండనుంది. 
 

మరిన్ని వార్తలు