అదనపు బాదుడు

11 May, 2015 23:55 IST|Sakshi

అద్దె బస్సుల్లో టిక్కెట్‌లేని ప్రయాణం
 ప్రయాణికుల నుంచి అదనంగా
 చార్జీల వసూలు
 ఆరో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె
 20 శాతానికి మించి ఆర్టీసీ బస్సులు
 నడపడం కష్టమంటున్న అధికారులు
 గ్రామీణ ప్రాంతాలకే చేరని పల్లెవెలుగు
 రాకపోకలు సాగిస్తున్న 264 బస్సులు  
 నేటినుంచి టిక్కెట్లతోనే ప్రయాణం
 

 నల్లగొండ సందిట్లో సడేమియా లాగా....ఆర్టీసీ కార్మికుల సమ్మెను అదునుగా చేసుకుని అద్దెబస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు వాహనాల దోపిడీ భరించలేని ప్రయాణికులకు అద్దె బస్సుల రూపంలోనూ తీవ్ర నష్టం వాటిల్లోతోంది. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు ఆర్టీసీ అద్దెబస్సులను రోడెక్కిచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఆర్టీసీ 81 బస్సులు నడుపుతుండగా అద్దె బస్సులు 183 నడుస్తున్నాయి. ఇవి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హైదరాబాద్, భువనగిరి మార్గాల గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే అద్దెబస్సుల యజమానులకు, అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకే వాటిని నడిపిస్తున్నారు. సమ్మె కాలంలో అద్దెబస్సుల నుంచి ఎలాంటి చార్జీలు ఆర్టీసీ తీసుకోరాదు. అలాగే ఆర్టీసీ చార్జీలనే ప్రయాణికుల నుంచి వసూలు చేయాలి.
 
 ప్రైవేటు డ్రైవర్లు, కండ క్టర్లు సాయంతో బస్సులు నడుపుతున్నారు కాబట్టి
 టిక్కెటు లేని ప్రయాణమే సాగుతోంది. దీనిని అతిక్రమించిన అద్దె బస్సుల యజమానులు ఆర్టీసీ చార్జీల కంటే ఎక్కువ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వంద రూపాయలు చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా రూ.120, 130 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల నుంచి మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు మంగళవారం నుంచి అద్దె బస్సుల్లో టిక్కెట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
 
 దీనికోసం సుక్షితులైన డ్రైవర్లు, కండక్టర్లు నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కార్మికుల సమ్మె ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ బస్సులు నడపడం కష్టసాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం రీజియన్ పరిధిలోని 720 బస్సుల్లో 20 శాతానికి మించి నడపడం కష్టమని అంటున్నారు. డిపో మేనేజర్లు మినహా కార్యాలయాల్లో ఉద్యోగులు సైతం సమ్మెలో ఉన్నందున ఇతర వ్యవహారాలు చూసుకోవడం వీలుపడదని అధికారులు పేర్కొంటున్నారు. ఉన్న బస్సుల్లో ఎక్కువ భాగం పట్టణ ప్రాంతాల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి తప్ప పల్లె ప్రాంతాలకు చేరడం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
 
 కార్మికుల నిరసనలు....
 నల్లగొండ డిపో ముందు కార్మికులు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. డిపో నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మిర్యాలగూడ డిపోలో కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. పోలీస్ ఎస్కార్ట్‌తో వివిధ ప్రాంతాలకు నాలుగు బస్సులు నడిపించారు. భువనగిరి నుంచి నల్లగొండ, గజ్వెల్ ప్రజ్ఞాపూర్, యాదగిరిగుట్ట, పికెట్ డిపోలకు చెందిన అద్దె బస్సులు నడిచాయి. ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక బస్ చార్జీలు వసూలు చేశారు. పోలీస్‌లు బస్సులకు అంతరాయం కలగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు.
 
  చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంస్థాన్ నారాయణపూర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్సుల రాకపోకలు ఆగిపోవడంతో ఆరు రోజులుగా పర్యాటకులు లేక  నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతం వెలవెలబోతుంది. కోదాడ  డిపో గేట్ ముందు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహిళ కండక్టర్లు, డ్రైవర్లు గేట్ ఎదుట బైఠాయించారు. పోలీసుల ద్వారా బస్సులను బయటకు తీసుకు రావడానికి అధికారులు తీవ్ర ప్రయత్నం చేయగా కార్మికులు ప్రతిఘటించారు. దీంతో కొద్దిసేపు కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు కార్మికులను బలవంతంగా తొలగించి నాలుగు బస్సులను బయటకు తీసుకొచ్చి నాలుగు రూట్లకు పంపారు. ఖమ్మం, మిర్యాలగూడెం, హైదరాబాద్ డిపోలకు చెందిన బస్సులు బస్టాండ్ బయట వరకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు