సెట్స్‌ దరఖాస్తులు 4,68,271

27 Jun, 2020 02:43 IST|Sakshi

గతేడాది కంటే ఎంసెట్‌కు పెరిగిన దరఖాస్తులు

30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు.. జూలై 6 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు

జూలై 1న పాలీసెట్‌.. ఈసెట్‌కు నేటి నుంచి హాల్‌టికెట్లు

లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఐదుగురు ట్రాన్స్‌జెండర్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్‌) రాసేందుకు 4.68 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పాలీసెట్‌కు ఈనెల 10తో దరఖాస్తు గడువు ముగిసిపోగా, ఆ తరువాత నుంచి ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయా సెట్స్‌కు 4,68,271 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఎంసెట్‌కు 2,21,505 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తరువాత పాలీసెట్‌కు 64,454 మంది, ఐసెట్‌కు 55,012 మంది దరఖాస్తు చేసుకున్నారు.

3 వరకు ఎంసెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ 
జూలై 6–9 తేదీల మధ్య నిర్వహించే ఎంసెట్‌కు గతేడాది కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 2.17 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి 2,21,505 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్‌ కోసం 1,42,645 మంది, అగ్రికల్చర్‌ కోసం 78,565 మంది, రెండింటి కోసం 295 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

జూలై 1న 250 కేంద్రాల్లో పాలీసెట్‌ 
పదో తరగతి ఉత్తీర్ణులై.. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూలై 1న పాలీసెట్‌ 2020 ప్రవేశపరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఫీజు చెల్లించినప్పుడే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే పాలీసెట్‌కు 38,404 మంది బాలురు, 26,050 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవాలని సూచించారు.  

జూలై 4న ఈసెట్‌ 
పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్‌ ఎంట్రీ) ఉద్దే శించిన ఈసెట్‌ను జూలై 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు తమ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. కాగా, జూలై 1 నుంచి 4 వరకు నిర్వహించే పీజీఈసెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు ఇప్పటికే చర్యలు చేపట్టామని పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కుమార్‌ వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 30 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 

జూలై 5 నుంచి ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్లు 
జూలై 15న నిర్వహించే ఎడ్‌సెట్‌ కోసం జూలై 5 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మృణాళిని తెలిపారు. ఇక పీఈసెట్‌కు హాజరయ్యేందుకు 5,457 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ చెప్పారు. ఈసారి స్కిల్‌టెస్టును రద్దు చేశామని, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్టు మాత్రమే ఉంటుందని, త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. జూలై 13న జరిగే ఐసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి తెలిపారు. 

జూలై 2 నుంచి లాసెట్‌ హాల్‌టికెట్లు 
లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 28,805 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 20,575 మంది పురుషులే. ఈసారి న్యాయవిద్య కోర్సుల్లో చేరేందుకు ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ముగ్గురు మూడేళ్ల న్యాయవిద్య కోర్సులో చేరేందుకు, ఇద్దరు ఐదేళ్ల కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసినట్లు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీరెడ్డి తెలిపారు. జూలై 10న నిర్వహించే లాసెట్‌ కోసం.. 2వ తేదీనుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు.

మరిన్ని వార్తలు