నేటి నుంచి వెబ్‌సైట్‌లో ఈసెట్‌ హాల్‌టికెట్లు

4 May, 2019 01:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ పూర్తిచేసి ఇంజనీరింగ్‌ సెకండియర్‌లో ప్రవేశానికి (లాటరల్‌ఎంట్రీ) నిర్వహించే టీఎస్‌–ఈసెట్‌ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్‌–ఈసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి 9వ తేదీ వరకు ecet.tsche.ac.in నుంచి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 11న ఉదయం 10 నుంచి 11 వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాలులోకి అనుమతించరని తెలిపారు.

ఈ పరీక్షకు 28,020 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణ కోసం మొత్తం 22 ప్రాంతీయ కేంద్రాలను (17 తెలంగాణలో, 5 ఏపీలో) ఏర్పాటుచేశారు. ప్రాంతీయ కేంద్రాల్లో అన్నింట్లో కలిపి 85 పరీక్షా కేంద్రాలున్నాయి. అభ్యర్థులంతా పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు తదితర ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష రాసే అభ్యర్థులు చేతులకు మెహిందీ, గోరింటాకు వంటివి పెట్టుకోకూడదని సూచించారు. 

మరిన్ని వార్తలు