బాలురదే హవా

25 May, 2018 00:44 IST|Sakshi

టీఎస్‌ఈసెట్‌ ఫలితాలు విడుదల

ఉత్తీర్ణత శాతం 92.05  

హైదరాబాద్‌: టీఎస్‌ఈసెట్‌లో బాలురే పైచేయి సాధించారు. మూడు బ్రాంచీలు మినహా మిగతా అన్ని బ్రాంచీల్లోనూ బాలురే అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. టీఎస్‌ఈసెట్‌–2018 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి గురువారం విడుదల చేశారు. జేఎన్‌టీయూహెచ్‌లోని యూజీసీ అకడమిక్‌ స్టాఫ్‌ కళాశాల ఆడిటోరియంలో జేఎన్‌టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ఎన్‌.యాదయ్య, ఈసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్, కో కన్వీనర్‌ చంద్రమోహన్, కో ఆర్డినేటర్‌ సమ్మూలాల్‌తో కలసి పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాల సీడీని, పాస్‌వర్డ్‌ను, బ్రాంచీల వారీగా మొదటి ఐదు ర్యాంకులను సాధించిన విద్యార్థుల జాబితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది చోటుచేసుకున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా ఈసెట్‌ పరీక్షను సజావుగా నిర్వహించామన్నారు. గతేడాదితో పోల్చి తే రెండువేలకు పైగా విద్యార్థులు ఈ ఏడాది పరీక్షకు హాజరైనట్టు తెలిపారు.

మొత్తం 27,652 మంది విద్యార్థులు ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 26,883 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. వీరిలో 24,746 మంది (92.05 శాతం) ఉత్తీర్ణత సాధించిన ట్టు తెలిపారు. ఇంజనీరింగ్‌ పది, ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌తో కలసి 12 బ్రాంచీలలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కెమికల్‌ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో మినహా అన్ని బ్రాంచీల్లోనూ బాలురే పైచేయి సాధించారు. ఫలితాలను చూసుకునేందుకు PROGRESSIVETS@ 2018  పాస్‌వర్డ్‌ను సైతం విడుదల చేశారు.  

జూన్‌ 10 నుంచి కౌన్సెలింగ్‌..
ఈసెట్‌ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 10 నుంచి చేపట్టనున్నట్టు పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడా రు. జూన్‌ 10 నుంచి కౌన్సెలింగ్‌ చేపట్టి ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు