టీఎస్‌ ఈసెట్‌ ఫలితాలు విడుదల 

23 May, 2019 02:03 IST|Sakshi
బుధవారం టీఎస్‌ ఈసెట్‌ ఫలితాలను విడుదల చేస్తున్న తుమ్మల పాపిరెడ్డి

90.32 శాతం ఉత్తీర్ణత నమోదు 

ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఈసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిల్లో 92.38 శాతం, అబ్బాయిల్లో 89.51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) అంశాల్లో ఈ నెల 11న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్‌ చేసుకోగా 27,123 మంది (96.74 శాతం) హాజరయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్‌ వీసీ ఎ.వేణుగోపాల్‌రెడ్డి, ఈసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్, టీఎస్‌ ఈసెట్‌ కోకన్వీనర్‌ ఎం.చంద్రమోహన్, కోఆర్డినేటర్‌ నర్సింహ పాల్గొన్నారు.  

వరంగల్‌ విద్యార్థుల ప్రతిభ..  
రామన్నపేట: టీఎస్‌ ఈసెట్‌లో వరంగల్‌ విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. హన్మకొండ గుడిబండల్‌ ప్రాంతానికి చెందిన జోగం గౌతమ్‌ మెకానికల్‌ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించాడు. ఇతను వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివాడు. ఈ సందర్భంగా గౌతమ్‌ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో రాణిస్తానని పేర్కొన్నారు.  

కంప్యూటర్‌ విభాగంలో.. 
హన్మకొండ కాపువాడకు చెందిన విన్నకోట శ్రీవాణి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విద్యార్థిని ఏపీ ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా రాణించాలన్నదే తన లక్ష్యమని విన్నకోట శ్రీవాణి పేర్కొంది.

మెరిసిన కవలలు.. 
గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన కొండూరు నిర్మల, ఉమామహేశ్వర్‌ దంపతుల కవల పిల్లలు శ్రీకన్య, శ్రీలేఖ టీఎస్‌ ఈసెట్‌ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వరంగల్‌ పాలిటెక్నిక్‌లో ఈసీఈ పూర్తి చేసిన వీరిద్దరూ ఏపీ, తెలంగాణలో నిర్వహించిన ఈసెట్‌ పరీక్షలు రాశారు. ఏపీ ఈసెట్‌లోశ్రీకన్య రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు, శ్రీలేఖ 50వ ర్యాంకు సాధించింది. అలాగే తెలంగాణ ఈసెట్‌లో శ్రీకన్య రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, శ్రీలేఖ 65వ ర్యాంకు సాధించినట్లు వారి తండ్రి ఉమామహేశ్వర్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు