ఏ పార్టీ గుర్తులు వారికే కేటాయిస్తాం: నాగిరెడ్డి

8 Jul, 2019 17:14 IST|Sakshi

రాజకీయ పార్టీలు, అధికారులతో ఈసీ కమిషనర్‌ నాగిరెడ్డి భేటీ

ఎన్నికల నిర్వహణపై చర్చ

గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, మున్సిపల్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ భేటీలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై వారితో చర్చించారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఈనెల 10న సిద్ధమవుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. షెడ్యూల్ లోపే ఎన్నికలు జరుపుతామని.. సుమారు 50 లక్షల ఓటర్లు పొల్గొనే అవకాశం ఉందని చెప్పారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. పలు వివరాలను వెల్లడించారు.

‘‘మున్సిపల్, వార్డుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తాం.12వ తేదీలోపు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే మున్సిపల్ కమిషనర్‌కు ఇవ్వచ్చు. 14వ తేదీ వరకు ఎన్నికల ఓటర్ జాబితాను ప్రకటిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొని నూతన జాబితా సిద్ధం చేస్తాం. ప్రతి వార్డులో ఎంత మంది ఉన్నారో తెలిశాక పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ల జాబితాను విడుదల చేస్తాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలను నిర్వహిస్తాం.  దాదాపు పాత పోలింగ్ కేంద్రాలనే ఈ ఎన్నికలకు కూడా ఉపయోగిస్తాం. ఈ నెల11న అధికారులతో మరోసారి సమావేశం ఉంటుంది. 13వ తేదీన పోలింగ్ కేంద్రాలపై మున్సిపల్ కమిషనర్లతో సమావేశం అవుతాం. 14న రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఆ తరువాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయిస్తాం’’ అని తెలిపారు. నాగిరెడ్డితో భేటీలో హాజరైన రాజకీయ పార్టీల నేతలు.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ  రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్‌ నిరంజన్‌, బీజేపీ మల్లారెడ్డి, సీపీఐ పళ్ల వెంకట్‌ రెడ్డి, సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డి, ఎంఐఎం జాఫ్రీ మున్సిపల్‌.

మరిన్ని వార్తలు