బీట్‌.. బహు బాగు

13 Jul, 2019 14:24 IST|Sakshi

రెండు జిల్లాలకు బీట్‌ ఆఫీసర్ల నియామకం     

ములుగుకు 105, భూపాలపల్లికి 104 పోస్టుల కేటాయింపు   

త్వరలో ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో 80 ఏజెన్సీ ఉద్యోగాలు

తీరనున్న సిబ్బంది కొరత  

మరింత పటిష్టం కానున్న పర్యవేక్షణ  

వన్యప్రాణులు, అటవీ సంపద స్మగ్లింగ్‌కు చెక్‌ ! 

 సాక్షి, భూపాలపల్లి: హలో.. హలో బీట్‌ ఆఫీసరేనా ఇక్కడ దుప్పిని చంపారు సార్‌. మీరు తొందరగా వచ్చి వేటగాళ్లను పట్టుకోండి అని ఓ బీట్‌ పరిధిలోని గూడెం నుంచి బీట్‌ ఆఫీసర్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. సమాచారం అందుకున్న బీట్‌ ఆఫీసర్‌ ఆగమేగాలతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొంత దూరం వెళ్లాకా.. మరో ఫోన్‌ కాల్‌ వచ్చింది.. సార్‌ ఇక్కడ పెద్ద ఎత్తున టేకు చెట్లను నరికి దుంగలను తరలించడానికి దుండగులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే రండి.. లేకుంటే వారు వెళ్లిపోతారని ఈ కాల్‌ సారాంశం. దీంతో ఆ బీట్‌ ఆఫీసర్‌ ఎటు వెళ్లాలో తేల్చుకోలేని çపరిస్థితి. దుప్పి మాంసాన్ని కాపాడలేదు.. కలప స్మగ్లింగ్‌ ఆగలేదు. ఒక ఆఫీసర్‌ రెండు నుంచి ఐదు బీట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితి  ఇప్పటి వరకు అటవీ శాఖలో ఉంది. ప్రస్తుతం బీట్‌ ఆఫీసర్ల నియామకంతో కొంతలో కొంతైనా వారిపై భారం తగ్గనుంది.

అడవి సంరక్షణలో బీట్‌ ఆఫీసర్లే కీలకం. క్షేత్రస్థాయిలో వన్య ప్రాణులు, కలప, అటవీ ఉత్పత్తుల కంటికి రెప్పలా కాపాడడంలో వీరిది అందవేసిన చేయి. అయితే కొంతకాలంగా వీరి కొతర అటవీశాఖను తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేక తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు కొత్తగా బీట్‌ ఆఫీసర్ల నియామకంతో కాస్త భారం దిగనుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గత కొన్నేళ్లుగా తగినంత మంది బీట్‌ ఆఫీసర్లు లేక ఉన్నవారిపైనే అదనపు భారం పడేది. దీంతో ఒక్కో బీట్‌ అధికారి ఒకటి కంటే  ఎక్కువ అటవీ బీట్ల విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొత్త బీట్‌ ఆఫీసర్లు వస్తుండడంతో అటవీ పరిరక్షణ మరింతగా పెరుగనుంది. 

పెరిగిన ఆఫీసర్లు.. 
కొత్తగా బీట్‌ ఆఫీసర్లు వస్తుండడంతో జిల్లాలో అటవీ శాఖపై పనిభారం తగ్గనుంది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కరీంనగర్‌ తూర్పు డివిజన్‌తో పాటు వరంగల్‌ నార్త్‌ డివిజన్‌ పరిధిలో ఉంది.  భూపాలపల్లి జిల్లాకు కరీంనగర్‌ తూర్పు డివిజన్‌ నుంచి 80 మంది, వరంగల్‌ నార్త్‌ డివిజన్‌ నుంచి 24 మందిని కేటాయించారు. మొత్తంగా జిల్లాకు 104 మంది కొత్త బీట్‌ అధికారులు రానున్నారు. అదే విధంగా ములుగు జిల్లా పూర్తిగా వరంగల్‌ నార్త్‌ డివిజన్‌ పరిధిలో ఉంది. ములుగులోని ఎస్‌ఎస్‌ తాడ్వాయి, ఏటూరునాగారం, ములుగు సబ్‌డివిజన్లకు 35 మంది చొప్పున   105 మంది బీట్‌ ఆఫీసర్లను కేటాయించారు. త్వరలో వీరు నియామకం కానున్నారు.  అలాగే 80 పోస్టులు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. వీటికి ఎస్టీ ట్రైబ్స్‌ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 13 మండలాలకు కేటాయించనున్నారు.  

స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట
దట్టమైన అడవులు, పర్యాటక కేంద్రాలు ఉన్న ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో  క్షేత్రస్థాయిలో బీట్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఇన్నాళ్లు ఇబ్బందులకు గురయ్యారు.  దీంతో వన్య ప్రాణుల వేట, కలప అక్రమ రవాణా, అడవిలో లభించి విలువైన వన మూలికలు, ఇతర సరుకులు అక్రమాలకు కాసులకు కురిపించేవి. స్మగ్లర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా బీట్‌ ఆఫీసర్లు వస్తుండడంతో ఇకపై అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే కొత్తగా పోడును నిలువరించడంతో పాటు హరితహారంలో మొక్కులు పెంచి అటవీని పచ్చగా మార్చుకోవచ్చు.  

ఖాళీగా కొన్ని బీట్లు
తాజాగా జరిగిన నియామకాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో బీట్‌ ఆఫీసర్లు ఖాళీల నియామకాలు జరిగాయి. ఇన్ని నియామకాలు జరిగినా రెండు జిల్లాల్లోని కొన్ని బీట్లు ఖాళీగానే ఉన్నాయి. మొన్నటి వరకు రెండు జిల్లాలో 532 బీట్లు ఉంటే కేవలం 110 మంది బీట్‌ ఆఫీసర్లు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో మొన్నటి వరకు 190 బీట్లకు గానూ 32 మంది, ములుగులో 342 బీట్లకు గానూ 78 మంది మాత్రమే బీట్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించారు.

సగటున ఒక బీటు చూసే అధికారి ఐదారు బీట్లు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొత్తగా నియమించే సిబ్బందితో ఈ సమస్యలను అధిగమించవచ్చని అటవీశాఖ భావిస్తోంది. ప్రస్తుతం భూపాలపలి జిల్లాకు కొత్తగా 104 మంది, ములుగు జిల్లాకు 105 మంది రానుండటంతో ఖాళీల సంఖ్య తగ్గింది. కొత్తగా వచ్చిన బీట్‌ ఆఫీసర్ల నియామకం జరిగిన తర్వాత భూపాలపల్లిలో 54 ఖాళీలు ఉంటాయి. ఆదే విధంగా ములుగులో 159 ఖాళీలు ఉంటాయి. అయితే మరో 80 ఏజెన్సీ పోస్టుల నియామకం ఉండటంతో ములుగు జిల్లా కూడా ఖాళీల సంఖ్య 80కి  తగ్గే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు