తెలంగాణ భూ చట్టం!

3 Dec, 2019 07:21 IST|Sakshi

నూతన రెవెన్యూ చట్టంపై సర్కారు కసరత్తు

ఒకే గొడుగు కిందకు పాత చట్టాలు

ఉద్యోగుల సర్దుబాటుపై కొత్త చట్టంలో స్పష్టత ఇచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ చట్టం అమలుతోపాటు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రస్తుతం అమ ల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న సర్కారు.. కొత్త చట్టం అమల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి ‘తెలంగాణ భూ చట్టం’గా నామకరణం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న రెవెన్యూ చట్టాలను ఏకీకృతం చేసేందుకు ప్రస్తుతం మనుగడలో ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టం తీరుతెన్నులు ఎలా ఉండాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారాన్ని కోరింది. అసైన్డ్, ఇనాం, రక్షిత, కౌలుదారు, ప్రభుత్వ భూములు ఇలా ఒక్కో కేటగిరీకి సంబంధించి కలె క్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకుంది. కొత్త చట్టం రూపకల్పనపై నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాన్ని కూడా కోరింది. వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయాలా లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా అనే అంశం పైనా సర్కారు కసరత్తు చేస్తోంది.

ప్రభుత్వం ముందు మూడు మార్గాలు..!
ప్రస్తుతం అమలులో ఉన్న 124 చట్టాలు/నియమాలను ఒకే గొడుగు కిందకు తేవడంతోపాటు కాలం చెల్లిన వాటిని తొలగించడం, గజిబిజిగా ఉన్న చట్టాలను సరళతరం చేస్తూ ఒకే చట్టం తీసుకువస్తారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టైటిల్‌ గ్యారంటీ చట్టం అమలు అంశాన్ని పరిశీలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్‌గౌడ్‌ 196 చట్టాలను ఏకీకృతం చేస్తూ ‘ఏపీ ల్యాండ్‌ రెవెన్యూ కోడ్‌’ను ప్రవేశపెట్టడమేగాకుండా రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఫైలును ఢిల్లీకి పంపారు. తరువాత ఆ ఫైలు అటకెక్క గా రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.

తెలంగాణ ల్యాండ్‌ రెవెన్యూ కోడ్‌...
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్‌ రెవెన్యూ కోడ్‌–2019ను ప్రవేశపెట్టాలనే వాదన కొందరు అధికారుల్లో వినిపిస్తోంది. ఈ కోడ్‌ ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానంలో ఒకే చట్టం అందుబాటులోకి రానుంది. ఈ రెండింటితోపాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్‌ రెవెన్యూ యాక్ట్‌–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టం కొలబద్ధగా కొత్త చట్టం రూపొందించడం ఉత్తమమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

న్యాయ నిపుణులతో సంప్రదింపులు...
కొత్త చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. న్యాయపరమైన అవరోధాలు రాకుండా నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది. పీఓటీ, ఇనాం, రక్షిత కౌలుదారు, భూ ఆక్రమణ, భూ దురాక్రమణ, ఎల్‌టీఆర్, అసైన్డ్, సర్వే, హద్దులు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించింది. మరోవైపు రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వీఆర్వో, వీఆర్‌ఏల రెవెన్యూ సేవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తున్నట్లు కనబడుతోంది. ఇదే అంశంపై శాసనసభ సాక్షిగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే వారిని పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలలో విలీనం చేయలా లేదా పనితీరు, మెరిట్‌ ఆధారంగా రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలా? అనే దానిపై కొత్త చట్టంలో స్పష్టత రానుంది. అలాగే బ్రిటిష్‌ కాలంలో శిస్తు వసూలు చేయడానికి నియమించిన కలెక్టర్ల వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తుండటాన్ని తప్పుబడుతున్న సీఎం.. కలెక్టర్ల హోదాను పునఃనిర్వచించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోదాల మార్పు కలెక్టర్లకే పరిమితం చేయకుండా ఆర్డీఓ, తహసీల్దార్లకు కూడా వర్తింపజేసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు