ప్రగతి భవన్‌ నుంచే ఆపరేషన్‌ ఆర్టీసీ!

5 Oct, 2019 17:43 IST|Sakshi

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న సర్కార్‌

ఒకేరోజు నాలుగు వేల మంది డ్రైవర్ల నియామకం

విధుల్లోకి  చేరకపోతే ఉద్యోగాలు ఉండవని స్పష్టీకరణ

సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తెలంగాణ ప్రభుత్వం దానికి ధీటుగా ప్రణాళికలు రచిస్తోంది. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏ‍ర్పాట్లపై దూకుడు పెంచింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగనిరీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే వేగంగా నియామకాలను చేపడుతోంది.  శనివారం సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని మరోసారీ టీఎస్‌ సర్కారు తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఒకే రోజు  దాదాపు నాలుగువేలకు పైగా డ్రైవర్లు, రెండు వేలకు పైగా కండక్టర్లను నియమించింది. నియామకాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. సర్కారు విధించిన గడవుకు సమయం దగ్గరపడుతుండటంతో విధుల్లో చేరని వారిపై వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. ముఖ్యమంత్రి  అధికార నివాసం ప్రగతి భవన్‌ నుంచే ఆపరేషన్‌ ఆర్టీసీని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం.. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యధావిధిగా నడపడం తదితర చర్యలను తీసుకోనున్నట్టు ఆయన వివరించారు. సమ్మెను ఎదుర్కోవడంలో భాగంగా ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోందని, ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహించి.. ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుందని ఆయన వెల్లడించారు. సమ్మెపై సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా