ఆర్టీసీ ప్రక్షాళన!

25 Dec, 2019 02:55 IST|Sakshi

డిపోల స్థాయిలో సిబ్బంది సర్దుబాటు

అనుబంధ విభాగాల్లో అక్కర్లేనివి తొలగింపు

దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం శ్రీకారం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రక్షాళనకు కసరత్తు మొదలైంది. ఎవరెక్కడ పనిచేస్తున్నారో, వారికిచ్చే వేత నానికి తగ్గ పని జరుగుతోందో లేదో, ఏ విభాగంలో ఎందరున్నారో వంటి విషయాలపై ఇప్పటివరకు లోపించిన జవాబుదారీతనాన్ని తిరిగి తీసు కొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సమ్మె అనంతరం టికెట్‌ ధరల పెంపుతో ఇప్పటికే సంస్థ ఆదాయం పెరగ్గా మరిన్ని చర్యలతో సంస్థకు మరింత ఊపు తెప్పించనుంది. కొన్ని విభాగాల్లో సిబ్బందికి సరైన పనే లేదు. కొన్ని చోట్ల తీవ్ర పని ఒత్తిడి ఉంది. ఇప్పుడు 800 బస్సులను తగ్గిం చడం, కొత్తగా సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభిస్తుం డటం, త్వరలో 1,334 అద్దె బస్సులు కొత్తగా ఆర్టీసీ లోకి వస్తుండటం.. వెరసి మొత్తం సంస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణ యించింది. దశల వారీగా అమలు చేయనుంది. తొలుత డిపో స్థాయిలో సిబ్బందిని సర్దుబాటు చేయడంతో ప్రారంభించి అనంతరం ఆర్టీసీలో అనుబంధంగా ఉన్న విభాగాల్లో అవసరం లేని వాటిని తొలగించనుంది.

సిబ్బంది పంపకాలు...: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీకి 97 డిపోలు ఉండగా వాటిల్లో కొన్ని డిపోలకు అవసరానికి మించి ఎక్కువ బస్సులు కేటాయించారు. దీంతో అవి నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 800 బస్సులను సంస్థ తగ్గిస్తోంది. తొలుత వెయ్యి బస్సులు అనుకున్నా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటిని 800కు తగ్గించాలని భావిస్తోంది. బస్సుల సంఖ్య తగ్గడంతోపాటు కండిషన్‌లో లేని దాదాపు మరో 400 డొక్కు బస్సులను తొలగించనుంది. అప్పుడు డిపోల్లో సిబ్బంది అవసరం కూడా తగ్గుతుంది. ఎక్కువ డిమాండ్‌ ఉన్న డిపోలకు ఎక్కువ బస్సులు కేటాయించి తక్కువ డిమాండ్‌ ఉన్న డిపోలకు తక్కువ బస్సులు ఉండేలా అధికారులు హేతుబద్ధీకరించనున్నారు. అంతగా పనిలేని సిబ్బందిని వేరే చోటకు పంపనున్నారు. మరో 15 రోజుల్లో 1,334 అద్దె బస్సులు కొత్తగా రాబోతున్నాయి. వాటి డ్రైవర్లు, మెకానిక్‌లను వాటి యజమానులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున ఆర్టీసీపై అంతమేర భారం తగ్గనుంది. గతంలో ఇలా మిగిలిపోయే సిబ్బందిని సర్దుబాటు చేయకపోవడంతో వారు పనిలేకుండా డిపోల్లో మిగిలిపోయారు. అలా ఉన్న పాత వారితోపాటు ఇప్పుడు కొత్తగా పని తగ్గే వారిని వేరే డిపోలకు సర్దుబాటు చేయనున్నారు. అప్పటికీ సిబ్బంది మిగిలితే సరుకు రవాణా విభాగం లాంటి వాటికి పంపనున్నారు.

బస్‌ బాడీ యూనిట్‌ ఉండదా?
ప్రస్తుతం ఆర్టీసీకి సొంతంగా మియాపూర్‌లో బస్‌ బాడీ వర్క్‌షాప్‌ ఉంది. అందులోనే బస్సుల నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ వర్క్‌షాప్‌ వల్ల ఉపయోగంకన్నా ఖర్చే ఎక్కువగా ఉంటోందని ఆర్టీసీ గుర్తించింది. దాని బదులు ప్రైవేటు కంపెనీలకు వర్క్‌షాప్‌ అప్పగిస్తే ఖర్చు తక్కువగా ఉంటుందని గుర్తించింది. దీంతో క్రమంగా బస్‌బాడీ వర్క్‌షాపును వదిలించుకునే ఆలోచనలో ఉంది. అలాగే హైదరాబాద్‌ శివార్లలోని హకీంపేట, వరంగల్‌లో ఆర్టీసీకి సొంత శిక్షణ కేంద్రాలు ఉండగా వాటి అవసరం లేదని సంస్థ భావిస్తోంది. వరంగల్‌లోని కేంద్రాన్ని మూసేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో ఉంది.

ప్రక్షాళన అవసరం...
ఆర్టీసీలో ఉన్న గందరగోళాన్ని వెంటనే నివారించేందుకు వీలుగా దిద్దుబాటు చర్యలు అవసరమని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన సంస్థ ఈడీలతో భేటీ అయ్యారు. డిపోలవారీగా ఉన్న సిబ్బంది, వారిపై ఉన్న పని ఒత్తిడిని గుర్తించి వెంటనే హేతుబద్ధీకరించాలని ఆదేశించారు. ఇతర అనుబంద యూనిట్ల అవసరం, వాటిని తొలగిస్తే ఎదురయ్యే సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీల అమల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. జనవరి మొదటి వారంలో అందుబాటులో ఉన్న వాహనాలతో సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు