లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మాణం

15 Feb, 2018 04:05 IST|Sakshi
బుధవారం జరిగిన సమీక్షలో దక్షిణ మ«ధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌తో మంత్రులు హరీశ్‌ రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు

రైల్వే జీఎంతో భేటీలో తుమ్మల, హరీశ్, మహేందర్‌రెడ్డి నిర్ణయం

ఈ సంవత్సరం 52.. దశలవారీగా 460 సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న 460 రైల్వే లెవెల్‌ క్రాసింగుల వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌వోబీ)లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు–భవనాలు, రైల్వే శాఖలు నిర్ణయించాయి. ఈ ఏడాది 52 ఆర్వోబీలను నిర్మించాలని ప్రతిపాదించాయి. వీటికి అయ్యే రూ.2,700 కోట్ల ఖర్చును రెండు శాఖలు చెరి సగం భరించనున్నాయి. బుధవారం ఇక్కడ రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌తో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నందున ఆర్వోబీలు కూడా నాలుగు వరుసలుగా ఉండేవిధంగా చూడాలని మంత్రులు కోరగా రైల్వే జీఎం అంగీకరించారు. గతంలో నాలుగు వరుసల రోడ్లపై రెండు వరుసల ఆర్‌వోబీలనే నిర్మించారు. వంతెనల్లో పట్టాల మీదుగా నిర్మించే భాగాన్ని ఇప్పటిదాకా రైల్వే శాఖ చేపడుతోంది. ఇక్కడ సమన్వయలోపం కారణంగా ఆ పనులు పెండింగ్‌లో ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక నుంచి ఆ భాగాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించారు. రైల్వేవాటా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తే పనులను రాష్ట్ర యంత్రాంగమే చేపడుతుంది. పాత ఆర్‌వోబీలను తొలగించి కొత్తవాటిని నిర్మించేందుకు రైల్వే జీఎం అంగీకరించారు. మియాపూర్‌– పటాన్‌చెరు మధ్య రైల్వే టెర్మినల్‌ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్టు తుమ్మల తెలిపారు. మెదక్‌– అక్కంపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం ఈ సంవత్సరాంతానికి పూర్తి అవుతుందని హరీశ్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు