జూలై 6 నుంచి ఎంసెట్‌!

13 May, 2020 03:39 IST|Sakshi

ఆగస్టులో కౌన్సెలింగ్‌ నిర్వహణకు కసరత్తు.. 

ప్రభుత్వానికి ప్రతిపాదించిన అధికారులు

కన్వీనర్‌ కోటా సీట్లు మిగిలిపోకుండా.. 

మెరిట్‌ విద్యార్థులునష్టపోకుండా షెడ్యూల్‌!

జూలై నాటికీ కరోనా అదుపులోకి రాకుంటే ఆగస్టులో ఎంసెట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలి స్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్‌లోనూ ఎంసెట్‌ను నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్న అధికారులు.. జూలై 6 నుంచి ఎంసెట్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ దీనిపై చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. 

జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఉన్నందున, జూలైలో వీలైనంత ముందుగా ఎంసెట్‌ నిర్వహించాలని యోచిస్తున్నారు. జూలై 6 నుంచి మొదలుపెడితే 15లోగా పూర్తి చేయవచ్చని, తద్వారా విద్యార్థులు 18వ తేదీ నుంచి జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధం కావచ్చని అంటున్నారు. ఒకవేళ జూలై తొలివారంలో నిర్వహంచకపోతే ఆగస్టుకు వెళ్లే అవకాశం ఉంది. జూలై 23 వరకు జేఈఈ మెయిన్‌ ఉండగా, అదే నెల 27 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్, తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాస్తారు. 

మరోవైపు రెండు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరవుతారు. కాబట్టి ఈ మూడు సెట్స్‌ తేదీలు క్లాష్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఓ అధికారి చెప్పారు. అందుకే జూలై మొదటివారంలోనే ఎంసెట్‌ను నిర్వహించేలా ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఒకవేళ జూలైలోనూ కరోనా అదుపులోకి రాకుండా, పరిస్థితి ఇబ్బందికరంగా మారితే ఏపీ ఎంసెట్‌ తరువాత ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ ఎంసెట్‌ నిర్వహించాల్సి వస్తుంది.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పైనా కసరత్తు
జేఈఈ మెయిన్‌ ఫలితాల తరువాతే అగ్రికల్చర్, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలోని టాప్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో సీట్లు మిగిలిపోకుండా చూడటంతో పాటు మెరిట్‌ విద్యార్థులకు ఆ సీట్లు లభించేలా చూడవచ్చని భావిస్తున్నారు. 

జేఈఈ మెయిన్‌ ఫలితాల కంటే ముందే ఎంసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే జేఈఈ ద్వారా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు లభించనున్న విద్యార్థులు కూడా ఎక్కువ మంది ముందుగా రాష్ట్ర కాలేజీల్లోనే చేరిపోతారు. ఆ మేరకు కన్వీనర్‌ కోటాలో సీట్లు బ్లాక్‌ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆ తరువాత మెరిట్‌లో ఉండే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. వారు కోరుకున్న కాలేజీలో, బ్రాంచీలో సీట్లు లభించవు. అదే జేఈఈ మెయిన్‌ ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్ర కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే ఈ పరిస్థితిని నివారించవచ్చు. 

జేఈఈ విద్యార్థులు కూడా తమకు వచ్చిన ర్యాంకులను బట్టి తమకు ఎక్కడ (ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలలో) సీటు లభిస్తుందనే అంశంపై ఓ అంచనాకు వస్తారు. అపుడు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో చేరే జేఈఈ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. తద్వారా తక్కువ సంఖ్యలో బ్లాక్‌ అయ్యే ఆ సీట్లను తదుపరి కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచి, మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం జరక్కుండా చూడవచ్చని భావిస్తున్నారు. అందుకే జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్‌ పరీక్షల ఫలితాలు జూలై 31 నాటికి వెలువడే అవకాశం ఉంది.

అప్పటివరకు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా ఆగాలని భావిస్తున్నారు. మొత్తానికి ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ చేపడితే ఇబ్బంది ఉండదన్న భావనతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీచేసిన అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం కొత్త విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులను ప్రారంభించవచ్చని చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా