హమ్మయ్య.. ‘పరపతి’ దక్కింది

13 Feb, 2020 02:34 IST|Sakshi
సీఎంతో భేటీకి ముందు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి పువ్వాడ

ఆర్టీసీ సిబ్బంది రుణాలకు గ్రీన్‌సిగ్నల్‌ 

పరపతి సంఘం బకాయిలు చెల్లించనున్న ఆర్టీసీ

రూ.600 కోట్ల రుణానికి పూచీకత్తు ఇవ్వనున్న ప్రభుత్వం

సీఎంతో చర్చించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇళ్ల నిర్మాణం తదితరాల కోసం కొంతకాలంగా గుట్టలుగా పేరుకుపోయిన ఆర్టీసీ ఉద్యోగుల దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించబోతోంది. తమ జీతాల నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఏర్పాటు చేసుకున్న నిధిని ఆర్టీసీ సొంత అవసరాలకు వాడేసుకోవటంతో ఈ సమస్య వచ్చి పడింది. తిరిగి దాన్ని చెల్లించే పరిస్థితి లేకపోవటంతో సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఉద్యోగుల దరఖాస్తులు పేరుకుపోవడంతో రుణాలు రాక వారి కుటుంబాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు బ్యాంకు నుంచి రుణం పొంది ఆ బకాయిలను తీర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అవి రాగానే ఉద్యోగుల దరఖాస్తులు కొలిక్కిరానున్నాయి.
 
తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేక ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్‌) నిధులను వాడేసుకుంటూ వచ్చింది. అలా ఏకంగా రూ.560 కోట్లు వినియోగించుకోవటంతో ఆ నిధి కాస్తా ఖాళీ అయింది.దీంతోపాటు ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్‌)కు సంబంధించి కూడా దాదాపు రూ.800 కోట్లు వాడేసుకుంది. దీనిపై ఇటీవల హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. వాడేసుకున్న భవిష్య నిధి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఈ రెండు బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఆర్టీసీ ముందుంది. కానీ చేతిలో నిధులు లేక బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు రూ.1400 కోట్లు బ్యాంకు రుణాలు పేరుకుపోయి ఉన్నాయి. వాటి వడ్డీ కూడా కొంతకాలంగా సరిగ్గా చెల్లించటం లేదు. బ్యాంకు రుణాలు సహా ఇతర అప్పులకు గాను సాలీనా రూ.180 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఉంది. అదీ చెల్లించటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ రుణం అంటే బ్యాంకులు స్పందించడం లేదు.

ఇటీవల ఆర్టీసీ బస్సుల చార్జీలు పెంచటంతో ఒక్కసారిగా ఆదాయం పెరిగింది. కొన్ని పొదుపు చర్యలతో ఖర్చులను తగ్గించుకోవటం ద్వారా ఆదాయం అదనంగా పెరిగినట్టయింది. ఈ నేపథ్యంలో ‘పరపతి’పెరగటంతో బ్యాంకులు అప్పులు ఇస్తాయన్న నమ్మకం ఆర్టీసీకి కలిగింది. గతంలో రూ.600 కోట్ల అప్పు కోసం ప్రభుత్వ పూచీకత్తు కావాలంటూ చేసిన ప్రతిపాదన పెండింగులో ఉండటంతో, దాన్ని మరోసారి ప్రభుత్వం ముందుంచింది. కానీ దానికి స్పందన రాలేదు. బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆర్టీసీ ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. సమావేశానంతరం మంత్రి సీఎం కేసీఆర్‌ కార్యాలయానికి వెళ్లి ఈ విషయంపై చర్చించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటంతో మరో రెండుమూడు రోజుల్లో రూ.600 కోట్ల పూచీకత్తు లోన్‌కు సంబంధించి ఉత్తర్వు విడుదల కాబోతోంది. ఆ వెంటనే రుణం పొంది æ సీసీఎస్, పీఎఫ్‌ బకాయిలను ఆ మేరకు తీర్చాలని నిర్ణయించారు.
 
వారంలో ఉద్యోగ భద్రత విధివిధానాలు 
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించి ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో విధివిధానాలను రూపొందించాలని మంత్రి అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణికులు టికెట్‌ తీసుకోకపోతే కండక్టర్లను సస్పెండ్‌ చేసే విధానం కొనసాగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. చిన్నచిన్న ప్రమాదాలకు కూడా డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటాన్నీ వారు తప్పు పడుతున్నారు. ఈ రెండు విషయాల్లో వారిలో ఉద్యోగ భద్రత ఉండేలా చూడనున్నారు. టికెట్‌ తీసుకునే బాధ్యత ఇక ప్రయాణికులదే. తీసుకోకుంటే వారిపైనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు రానున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై త్వరలో స్పష్టత రానుంది. ఇక డిపోల్లో ఉద్యోగులను వేధిస్తున్నారంటూ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నందున వీటిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఉద్యోగులతో స్నేహభావంతో మెలిగి సంస్థ పురోగతి కోసం యత్నించాలని ఆయన ఆదేశించారు. ఇక నుంచి ప్రతి మంగళవారం ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర సెలవుల విషయంలో మానవతాధృక్పథంతో స్పందించాలన్నారు. బస్సుల్లో సిబ్బంది ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రత్యేక సందర్భాల్లో వారిని విధిగా విష్‌ చేయాలని ఎండీ సునీల్‌శర్మ పేర్కొన్నారు. సిటీ బస్టాపులు, కూడళ్లలో బస్సుల వివరాలు తెలిపే ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఈడీలు పురుషోత్తం, వినోద్, టీవీరావు, యాదగిరి, వెంకటేశ్వరరావు, ఎఫ్‌ఏ రమేశ్, ఎస్‌ఎల్‌ఓ శ్రీలత, సీపీఎం సూర్యకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు