ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం?

26 Nov, 2019 10:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ) ఇక కాలగర్భంలో కలిసిపోనుందా? త్వరలోనే ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. గురువారం జరగబోయే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటుచేసే యోచనలో ఉందని తెలుస్తోంది.
చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

అత్యంత సుదీర్ఘంగా 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ సోమవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం అవునన్నా.. కాదన్నా మంగళవారం నుంచి కార్మికులు విధులకు హాజరుకావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే, కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని ప్రకటనలో తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు