కాళేశ్వరం నీళ్లు.. చెరువులకే ముందు!

10 Feb, 2018 02:53 IST|Sakshi
కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ భాగం(ఫైల్‌ ఫొటో)

రిజర్వాయర్లు పూర్తిగాకున్నా వ్యవసాయానికి నీరు

3,50,000 ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక

మల్లన్నసాగర్, గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ఆయకట్టుకు అందించేలా చర్యలు

ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి 8 కిలోమీటర్ల మేర ఫీడర్‌ చానల్‌

నేరుగా రిజర్వాయర్ల కింది కాలువలకు అనుసంధానం

400 వరకు చెరువులు నింపి సాగుకు నీరివ్వడమే లక్ష్యం

ఇందుకోసం శరవేగంగా కాల్వల నిర్మాణం

మిడ్‌మానేరు–మల్లన్నసాగర్‌ అనుబంధ పనులపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత త్వరగా సాగునీరివ్వాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాకున్నా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రధాన కాలువ నుంచి నేరుగా ఫీడర్‌ చానల్‌ను తవ్వి.. చెరువులను నింపడంతోపాటు నేరుగా పొలాలకు కూడా నీరివ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రిజర్వాయర్లకన్నా ముందుగా శరవేగంగా కాల్వల పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతోంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్ల పనులు ఇప్పటికిప్పుడు పూర్తయ్యే అవకాశం లేని నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫీడర్‌ చానల్‌ ద్వారా 400 వరకు చెరువులు నింపడంతోపాటు 3.5 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా కాల్వల తవ్వకాలను ముమ్మరం చేస్తోంది. ఈ నాలుగు రిజర్వాయర్లకు నీరు వచ్చే మిడ్‌మానేరు–మల్లన్నసాగర్‌ మధ్య అనుబంధ పనులను పూర్తి చేస్తోంది.

దిగువకు అంతా సిద్ధం..
కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్‌కు చేరాలంటే ఎగువనున్న మేడిగడ్డ–ఎల్లంపల్లి, ఎల్లంపల్లి–మిడ్‌మానేరు, మిడ్‌మానేరు–మల్లన్నసాగర్‌ లింకు పనులు పూర్తి కావాలి. ఇప్పటికే మేడిగడ్డ–ఎల్లంపల్లి మధ్య మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌస్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపును మూడు ప్యాకేజీలు (ప్యాకేజీ 6, 7, 8)గా విడగొట్టగా... ఇందులో మేడారం రిజర్వాయర్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్యాకేజీల పరిధిలో 49.81 కిలోమీటర్ల మేర టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా.. 49.63 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. గ్రావిటీ కెనాల్, అప్రోచ్‌ చానల్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇక మిడ్‌మానేరుకు వచ్చే నీటిని మల్లన్నసాగర్‌కు తరలించే పనులను ప్యాకేజీ 10, 11, 12గా విడగొట్టగా.. అనంతగిరి, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్ల పనులు జూన్‌ నాటికి పూర్తి కానున్నాయి. వాటి పరిధిలో పంపుల బిగింపు ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తంగా జూన్‌ నాటికి ఈ పనులన్నింటినీ పూర్తిచేసి అనంతగిరి కింద సిరిసిల్ల జిల్లాలో 30 చెరువులు నింపి, 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. రంగనాయక సాగర్‌ కింద సిద్దిపేట జిల్లాలో 39, సిరిసిల్ల జిల్లాలో 59 చెరువులు నింపడంతోపాటు ఎడమ కాల్వ కింద 70 వేల ఎకరాలు, కుడి కాల్వ కింద 40 వేల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఈ రిజర్వాయర్ల అనంతరం మల్లన్నసాగర్‌కు చేరే నీటిని ఫీడర్‌ చానల్‌ తవ్వి.. గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింది కాల్వలకు అనుసంధానించనున్నారు. తద్వారా నేరుగా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధమైంది.

మల్లన్నసాగర్‌ దిగువన 3.50 లక్షల ఎకరాలకు..
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను 50 టీఎంసీలు, కొండపోచమ్మ 15, గంధమల 9.86, బస్వాపూర్‌ 11.39 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతుండగా.. వాటిని పూర్తి చేసేందుకు మూడేళ్ల సమయం పట్టనుంది. ఆలోగానే వాటి కింది ఆయకట్టుకు నీరిచ్చేలా తాజా ప్రత్యామ్నాయాన్ని అధికారులు సిద్ధం చేశారు. రంగనాయక సాగర్‌ నుంచి వచ్చే నీటిని నేరుగా మల్లన్నసాగర్‌ పరిధిలో 8 కిలోమీటర్ల మేర ఫీడర్‌ చానల్‌ తవ్వి గంధమల, బస్వాపూర్‌ కాల్వలకు తరలిస్తారు. అటు కొండపోచమ్మ సాగర్‌ కింది కాల్వలకు నీటిని తరలించే పనులు కూడా మొదలు పెట్టారు. ఈ రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చయ్యే ఈ ఫీడర్‌ చానల్‌తో గంధమల, బస్వాపూర్‌ల ప్రధాన కాల్వల కింది 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. దీంతోపాటు కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ను నింపి రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్‌ పనులు జూలై నాటికి పూర్తయ్యే అవకాశముంది. దీనికిందే 150 చెరువులు నింపేలా ప్రణాళిక వేశారు. అటు మల్లన్నసాగర్‌ కింద 1.25 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా.. 90 చెరువులు నింపి వీలైనంత ఆయకట్టుకు నీరందిస్తారు. మొత్తంగా ప్రత్యామ్నాయ చర్యల కారణంగా వచ్చే వర్షాకాలం నాటికే 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి. 

మరిన్ని వార్తలు