రూ. 100 కే నల్లా కనెక్షన్‌ 

15 Feb, 2019 03:31 IST|Sakshi

పట్టణ ప్రాంతాల్లో ఏపీఎల్‌ కుటుంబాలకు వర్తింపు

ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం

బీపీఎల్‌ కుటుంబాలకు అందిస్తున్న 

రూపాయికే కనెక్షన్‌ యథావిధిగా కొనసాగింపు

సాక్షి, హైదరాబాద్‌: పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఏపీఎల్‌ కుటుంబాలకు (దారిద్య్రరేఖకు ఎగువనున్న వారు) వంద రూపాయలకే నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం సంతకం చేశారు. ఇప్పటికే బీపీఎల్‌ కుటుంబాలకు (దారిద్య్రరేఖకు దిగువనున్న వారు) ప్రభుత్వం రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తుండగా దాన్ని యథావిధిగా కొనసాగించనుంది.

ఇతరులు పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్‌ పొందేందుకు ఇప్పటివరకు రూ. 6,000 డిపాజిట్‌ తీసుకుంటుండగా ఇంటి లోపల నల్లా పెట్టుకోవడానికి ప్రస్తుతం రూ. 10,500 డిపాజిట్‌ తీసుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్‌ రుసుము ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్‌ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. ‘మిషన్‌ భగీరథతో అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోంది.

అందరూ నల్లా కనెక్షన్‌ పొందాలంటే డిపాజిట్‌ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నల్లా కనెక్షన్‌ డిపాజిట్‌ను తగ్గిస్తున్నాం. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మిషన్‌ భగీరథతో అందే శుద్దిచేసిన నీటిని తాగాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1.20 లక్షల ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. డిపాజిట్‌ ఎక్కువగా ఉన్నందున మిగతా ఇంటి యజమానులు ముందుకు రావడంలేదు. దీంతో 6.7 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్‌ లభించలేదు. వీటికితోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల మందికి నల్లా కనెక్షన్‌ అందాల్సి ఉంది. అంతా కలిపి పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలి.

డిపాజిట్‌ ఎక్కువ ఉన్నందున వీరు నల్లా కనెక్షన్‌ తీసుకునేందుకు ముందుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనివల్ల ప్రజలందరికీ మిషన్‌ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు తాగించాలనే లక్ష్యం నెరవేరదు. అందుకే ఆర్థికంగా భారమైనప్పటికీ మంచినీటి నల్లా కనెక్షన్‌ కోసం చెల్లించాల్సిన డిపాజిట్‌ను నామమాత్రం చేయాలని నిర్ణయించాం. ప్రజలందరూ శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు