నవ రాష్ట్రం.. యువ మంత్రం

16 Oct, 2016 01:06 IST|Sakshi
నవ రాష్ట్రం.. యువ మంత్రం

జిల్లా కలెక్టర్లుగా యువ ఐఏఎస్‌లు
కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన సర్కారు
జిల్లాల పునర్విభజనతో మారిన పరిస్థితి


       ఐఏఎస్ బ్యాచ్:   జిల్లా కలెక్టర్లు ఇలా..
             2012:     4
             2011:     2
             2010:     4
             2009:     2
             2008:     1
             2007:     4
             2006 నాటి కంటే ముందు:     14
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో పరిపాలన ఇక కొత్త పుంతలు తొక్కనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త జిల్లాలకు యువ అధికారులను కలెక్టర్లుగా నియమించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సంకేతాలిచ్చింది. పదేళ్లకుపైగా అనుభవమున్న ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమించే పాత ఆనవాయితీకి స్వస్తి పలికింది. నాలుగేళ్ల జూనియర్లకు సైతం కొత్త జిల్లాల పాలనా పగ్గాలు అప్పగించింది. అందుబాటులో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా 27 మందికి కొత్త జిల్లాల బాధ్యతలను కట్టబెట్టడం గమనార్హం. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేసిన కసరత్తు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

అనూహ్యంగా మూడింతలకు పైగా పెరిగిన జిల్లాలకు కలెక్టర్లను సర్దుబాటు చేసేందుకు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వటం సర్కారుకు అనివార్యమైంది. దీంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా కసరత్తు చేసి కలెక్టర్ల నియామకంలో ఆచి తూచి వ్యవహరించారు. కొన్నిచోట్ల సీనియర్లను కొనసాగించటంతోపాటు యువ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎక్కువ జిల్లాల్లో యువ నవతరం కలెక్టర్లు, ఎస్పీలుగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ చిన్న జిల్లాల్లో కలెక్టర్ల నియామకాలు ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.

నాలుగేళ్ల జూనియర్లకు చాన్స్
జిల్లాల పునర్విభజన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగేళ్ల జూనియర్ ఐఏఎస్‌లకు సైతం కలెక్టర్లుగా పని చేసే అవకాశం కల్పించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ రోజునే ప్రభుత్వం 27 జిల్లాలకు కలెక్టర్ల నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 2012 బ్యాచ్‌కు చెందిన జూనియర్ ఐఏఎస్ అధికారులు నలుగురు ఉన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వి.ఎస్.అలగు వర్షిణి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు 2012 బ్యాచ్‌కు చెందిన యువ అధికారులు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటం, సుపరిపాలన లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టడంతో అనూహ్యంగా వీరికి  జిల్లా కలెక్టర్‌గా పని చేసే అవకాశం లభించింది.

వీరితో పాటు 2011 బ్యాచ్‌కు చెందిన పాటిల్ ప్రశాంత్ జీవన్‌ను వరంగల్ రూరల్ జిల్లాకు, శ్వేతా మొహంతీని వనపర్తి జిల్లాకు కలెక్టర్లుగా నియమించింది. 2010 బ్యాచ్‌కు చెందిన మరో నలుగురికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ బ్యాచ్‌కు చెందిన భారతి హోళికెరిని మెదక్ జిల్లాకు, ప్రీతి మీనాను మహబూబాబాద్ జిల్లాకు, ఆమ్రపాలిని వరంగల్ అర్బన్‌కు, డి.దివ్యను వికారాబాద్ జిల్లాకు కలెక్టర్లుగా నియమించారు. వీరితోపాటు 2009 బ్యాచ్‌కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ఎన్.సత్యనారాయణ, 2008 బ్యాచ్‌కు చెందిన శ్రీదేవసేన, 2007 బ్యాచ్‌కు చెందిన కె.సురేంద్రమోహన్, పి.వెంకట్రామిరెడ్డి, ఎంవీ రెడ్డి, రజత్‌కుమార్ షైనీలు కలెక్టర్లుగా వివిధ జిల్లాల బాధ్యతలు స్వీకరించారు. వీరందరూ పదేళ్ల లోపు సీనియర్లు. వీరిలో ఎక్కువ మందికి కనీసం జిల్లాల్లో పని చేసిన అనుభవం కూడా లేదు. మొత్తంగా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 17 జిల్లాల బాధ్యతలను జూనియర్లకే అప్పగించారు.
 
సీనియర్ రాహుల్ బొజ్జా
పునర్విభజన ప్రభావం లేని హైదరాబాద్ జిల్లాకు ప్రభుత్వం ప్రస్తుత కలెక్టర్ రాహుల్ బొజ్జాను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతమున్న జిల్లా కలెక్టర్లందరిలో ఆయనే సీనియర్. 2000 బ్యాచ్‌కు చెందిన రాహుల్ బొజ్జా గతంలో వరంగల్, మెదక్ జిల్లాల్లో పని చేశారు. అనుభవమున్న అధికారి కావటంతో ఆయనకు రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్న జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఆయన తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన జ్యోతి బుద్ధప్రకాశ్, ఖమ్మం కలెక్టర్ లోకేశ్‌కుమార్ సీనియర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.
 
గతంలో ఎంతో నిరీక్షణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, జిల్లాల పునర్విభజనకు ముందు తెలంగాణలో జిల్లా కలెక్టర్ పదవి కోసం ఐఏఎస్ అధికారులు కనీసం పదేళ్లు, గరిష్టంగా 12 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చేది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అసిస్టెంట్ కలెక్టర్‌గా రెండు నుంచి మూడేళ్లు, అసిస్టెంట్ కలెక్టర్ (డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్)గా మూడేళ్లు చేస్తే గానీ జాయింట్ కలెక్టర్‌గా అవకాశం వచ్చి ఉండేది కాదు. జాయింట్ కలెక్టర్‌గా రెండేసి జిల్లాలకు నాలుగు నుంచి ఐదేళ్లు పని చేసిన తర్వాతే జిల్లా కలెక్టర్ అయ్యేవారు. జిల్లాల పునర్విభజన ఫలితంగా తెలంగాణలో నాలుగేళ్ల సర్వీసు ఉన్న అనేక మంది యువ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కలెక్టర్లు అయ్యారు.

మరిన్ని వార్తలు