‘విక్టోరియా హోం’ లీజు రద్దు

29 Nov, 2017 04:16 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

దేవాదాయ భూములపై ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదు

తీర్పులో తేల్చిచెప్పిన ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని నిజాం కాలం నాటి విక్టోరియా మెమోరియల్‌ హోం రెసిడెన్షియల్‌ స్కూల్‌కు చెందిన భూమిని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు లీజుకిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. దేవాదాయ భూముల విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. భూమి విషయంలో ఏ నిర్ణయమైనా చట్టానికి లోబడి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. విక్టోరియా హోంకు చెందిన భూమిని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ నిర్మాణానికి లీజుకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ విక్టోరియా మెమోరియల్‌ హోం అనాథ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.బుచ్చిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

11 ఏళ్ల లీజు చట్టవిరుద్ధం..
అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. రికార్డులను పరిశీలిస్తే, విక్టోరియా హోం భూములను స్వాధీనం చేసుకునేందుకు కథ నడిపించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేవాదాయ భూమి ఎప్పటికీ ప్రభుత్వ భూమి కాదని ధర్మాసనం మరోసారి గుర్తు చేసింది. ‘దేవాదాయ చట్ట నిబంధనల ప్రకారం మూడేళ్లకు మాత్రమే లీజు ఇచ్చే అధికారం కమిషనర్‌కు ఉంది. ఒకవేళ అంతకు మించిన గడువుతో లీజుకివ్వాలంటే గరిష్టంగా ఐదేళ్లకు మాత్రమే ఇవ్వొచ్చు. అది కూడా ప్రభుత్వ అనుమతితోనే చేయాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. విక్టోరియా భూమిని 11 ఏళ్లకు లీజుకివ్వడాన్ని తప్పుబట్టింది. ఏ అధికారంతో అంత కాలానికి లీజుకిచ్చారని నిలదీసింది. ఐదేళ్లకు మించి లీజుకివ్వాలంటే బహిరంగ వేలం నిర్వహించాలని, అలా చేయకుండా 11 ఏళ్లకు లీజుకివ్వడం చట్ట నిబంధనలకు విరుద్ధమని, దేవాదాయ ట్రస్ట్‌కు చెందిన ఆ భూమిని లీజుకివ్వాలంటే ట్రస్ట్‌ కార్యవర్గమే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. కార్యవర్గం నుంచి లీజుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన వినతి రికార్డుల్లో ఎక్కడా తమకు కనిపించలేదంది. ట్రస్ట్‌ లేకపోతే ప్రభుత్వం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని, అయితే ప్రస్తుత కేసులో అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తెలిపింది.

అది ఎప్పటికీ ప్రభుత్వ భూమి కాదు..
దేవాదాయ భూమికి ప్రభుత్వం ధర్మకర్త మాత్రమేనని, ఆ భూమిని స్వాధీనంలోకి తీసుకోవడానికి.. ఆ భూమిపై ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అవసరమైన పక్షంలో ఆ భూమిని పరిహారం చెల్లించి భూసేకరణ కింద తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ‘అవసరం మీదే.. భూమి కావాలని కోరేదీ మీరే.. భూమి ఇచ్చేదీ మీరే.. ఇలా అయితే ఎలా?’అని ప్రశ్నించింది. లీజు మొత్తాన్ని గణనీయంగా తగ్గించడాన్ని కూడా ధర్మాసనం తన తీర్పులో తప్పుబట్టింది. దేవాదాయ భూమిని దానం చేసిన దాతలకు గానీ, వారి వారసులకు గానీ ఆ భూమిని దేవాదాయ అవసరాలకు కాక మరో అవసరానికి కేటాయిస్తున్నట్లు ఎక్కడ సమాచారం ఇచ్చారని ప్రశ్నించింది. ముందు 11 ఏళ్ల లీజు, ఆ తర్వాత 33 ఏళ్లు, ఆ తర్వాత భూమి మాదేనంటారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విక్టోరియా హోంకి నిధులిస్తున్నారన్న సాకుతో క్రమంగా దానికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని, కావాలంటే నిధులు ఇవ్వడం మానుకోవాలని, అంతే తప్ప ఇలా చట్టవిరుద్ధంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తెగేసి చెప్పింది. దేని ఆధారంగా లీజుకివ్వాలని దేవదాయ కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదంటూ, లీజు ఉత్తర్వులను రద్దు చేసింది.

మరిన్ని వార్తలు