చెల్లింపులపై సర్కారు ఆంక్షలు

14 Oct, 2019 01:40 IST|Sakshi

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో సర్కారు పొదుపు చర్యలు ఆచితూచి వ్యవహరించాలని అన్ని శాఖలకు ఆర్థికశాఖ మార్గదర్శకాలు ఆసరా, ఉద్యోగుల జీతాలు, బియ్యం, విద్యుత్‌ సబ్సిడీలకే నెలవారీ చెల్లింపులు బడ్జెట్‌ అంచనాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకోవాలని సూచన కేంద్ర ప్రాయోజిత పథకాలకూ అంతే కొత్త పథకాల ప్రతిపాదనలు పంపాకే నిధుల విడుదలపై నిర్ణయం.

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఏర్పడిన నిధుల కటకటను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రారంభించింది. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థికశాఖ ఆంక్షలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి శాఖకు ప్రతిపాదించిన బడ్జెట్‌ అంచనాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలంటూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు పేరిట అన్ని ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు అందాయి. నెలవారీ చెల్లింపుల విషయంలోనూ కొన్ని పరిమితులు తప్పవని, నాలుగు అంశాలకు మాత్రమే నెలవారీ చెల్లింపులు చేస్తామని, మిగిలిన విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఉత్తర్వుల్లో ఇచ్చారు.  

నెలనెలా చెల్లింపులు పరిమితం..
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేవలం నాలుగు పథకాలకే నెలనెలా చెల్లింపులు చేస్తామని ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆసరా పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు, బియ్యం, విద్యుత్‌ సబ్సిడీలకు  మాత్రమే బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు (బీఆర్‌వోలు) విడుదలవుతాయని, మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వ  పథకాలకు సంబంధించిన ఖర్చులను త్రైమాసికానికి ఓసారి మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది.కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఇప్పటివరకు విడుదలచేసిన మొత్తాన్ని కలుపుకొని బడ్జెట్‌ అంచనాల ప్రతిపాదనల్లో 75% మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కొన్ని విభాగాల ఖర్చు కూడా త్రైమాసిక పద్ధతిలోనే ఇస్తామని తెలిపింది. దీంతో ఆయా ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాలు మూడు నెలలకోసారి మాత్రమే వస్తాయని తెలుస్తోంది. వీఆర్‌ఏలకు ఇచ్చే గౌరవ వేతనాలను మాత్రం ట్రెజరీ ఆంక్షలకు సంబంధం లేకుండా నెలనెలా ఇవ్వాలని ఆర్థికశాఖ తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది.
 
ప్రస్తుత పథకాలపైనే దృష్టి..
తాజా ఉత్తర్వులను పరిశీలిస్తే ఈ ఏడాదికి కొత్త పథకాల అమలు కష్ట మేనని అర్థమవుతోంది.ప్రస్తుతం అమలవుతున్న పథకాలు తప్ప కొత్త పథ కాలు, రుణాలకు సంబంధించి ఆయా శాఖల ద్వారా ప్రతిపాదనలు పం పిన తర్వాతే నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థికశాఖ వెల్లడించడం గమనార్హం. దీంతోపాటు ప్రభుత్వ ఆఫీసులు లేదా సంస్థలు లేదా వసతిగృహాల కరెంటు, నీటి బిల్లులు, అద్దెలకు సంబంధించిన నిధుల్లో ఇప్పటివరకు విడుదల చేసిన వాటిని మాత్రమే ఇస్తామని, ముందే చెల్లించి ఆ తర్వాత నిధులివ్వాలంటే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అన్ని శాఖలు బీఆర్‌వోలు ఇచ్చే సమయంలో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ట్రెజరీలు కూడా ఇప్పటివరకు ఆయా శాఖలకు ఇచ్చిన నిధు లను మినహాయించుకొని బడ్జెట్‌ అంచ నాల్లో 75 శాతానికి మిగిలే నిధులకే బీఆర్‌వోలు, ఎల్‌వోసీలను అను మతించాలని కూడా ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు