భయపెట్టి అనంతగిరి భూసేకరణ

11 Jul, 2020 03:47 IST|Sakshi

చట్ట వ్యతిరేకమన్న  హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో భాగమైన అనంతగిరి జలాశయం నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించేందుకు ప్రభుత్వాధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయకుండానే భూముల్ని సేకరిస్తున్నారంటూ దాఖలైన మూడు వేరువేరు వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణలతో కూడిన ధర్మాసనం 52 పేజీల తీర్పును శుక్రవారం వెలువరించింది.

హైకోర్టు 2016లో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయని... సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో, భూసేకరణ అధికారి అనంతరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్, చిన్నకొండూరు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, పూర్వపు తహసీల్దార్‌ పరమేశ్వర్‌ల సర్వీస్‌ రికార్డుల్లో కోర్టు ఆదేశాలను ఉల్లఘించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

‘ఉద్ధేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయలేదు. భూసేకరణ చట్టాలను అమలు చేయకుండా రైతులను భయపెట్టి వారితో భూ విక్రయ ఒప్పందపత్రాలపై సంతకాలు చేయించారు. రాజ్యాంగంలోని 14వ అధికరణ స్ఫూర్తిని దెబ్బతీశారు. రాత్రి వేళ ఖాళీ చేయించిన వారిలో 11 మంది ఎస్సీలు ఉన్నారు. ఇలా చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్‌ విచారణ చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. భూములకు ధరల్ని నిర్ణయించడంలోనూ పద్ధతి లేకుండా వ్యవహరించారు. 2019 జనవరి 15న రైతుల నుంచి తీసుకున్న భూములకు వాటి ధర ప్రకారం పరిహారాన్ని ఖరారు చేసే ముందు రైతుల వాదనలు తెలుసుకోవాలి.

ఇప్పటికే ఇచ్చిన పరిహారాన్ని రైతుల నుంచి తీసుకోకుండా... మూడు నెలల్లోగా చెల్లించబోయే పరిహారంలో సర్దుబాటు చేయాలి. హైకోర్టును ఆశ్రయించిన 61 మంది రైతులకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేల చొప్పున చెల్లించాలి. 2016లో వ్యవసాయ భూములకు, ఈ ఏడాది పిటిషనర్ల ఇళ్లను సేకరించేందుకు నోటిఫికేషన్లు వేరువేరుగా ఇచ్చారు కాబట్టి వాటికి వేరువేరుగానే పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌ఆర్‌ ప్యాకేజీ) ఇవ్వాలి. ఆర్‌ఆర్‌ చట్టంలోని నిబంధన ప్రకారం 18 సంవత్సరాలు నిండిన పెళ్లి కాని వారిని మరో కుటుంబంగా పరిగణించి వారికి కూడా పరిహారం చెల్లించాలి’అని హైకోర్టు తీర్పు చెప్పింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా