అప్పులుంటే అసెంబ్లీ కట్టకూడదా? 

2 Aug, 2019 07:39 IST|Sakshi

ఎర్రమంజిల్‌ కేసులో హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వానికి అప్పులుంటే నిర్మాణ రంగంలో అభివృద్ధి పనులు చేయకూడదా?, అప్పులుంటే అసెంబ్లీ భవనాలు కట్టరాదని ఏవిధంగా ఉత్తర్వులివ్వాలో తెలపాలని ఎర్రమంజిల్‌ భవన కూల్చివేత కేసులో పిటిషనర్‌ను హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌ భవనం శిథిలావస్థకు చేరిందని, ప్రభుత్వం అసెంబ్లీ సముదాయ భవనాల్ని నిర్మిస్తే ఏవిధంగా చట్ట వ్యతిరేకం అవుతోందో చెప్పాలని వారిని ఆదేశించింది. ఎర్రమంజిల్‌ భవన ప్రదేశంలో అసెంబ్లీ భవనాల్ని నిర్మించాలనే నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై గురువారం విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం పైవిధంగా ప్రశ్నించింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ.. తెలంగాణ ఆవిర్భావం జరిగే నాటికి రాష్ట్ర అప్పులు రూ.70 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.1.90 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. అప్పులుంటే నిర్మాణాలు చేయకూడదా, కేంద్రానికి కూడా అప్పులు ఉంటాయని, ఈ పరిస్థితుల్లో కేంద్రం కూడా నిర్మాణ రంగం లో ఏమీ చేయకూడదా అని ధర్మాసనం ప్రశ్నిం చింది. ప్రతిపాదనలు, ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం తనకు తోచినట్లుగా చేస్తోందని మరో న్యాయవాది రచనారెడ్డి చెప్పడంపై ధర్మాసనం.. హైకోర్టులో రాజకీయ ప్రసంగాల మాదిరిగా చెప్పవద్దని, ఉద్వేగభరితంగా చెప్పడానికి ఇదేమీ ప్రజావేదిక కాదని వ్యాఖ్యానించింది. ఎర్రమంజిల్‌ భవనం శిథిలావస్థకు చేరింది కదా.. అని ప్రశ్నించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు