కేబినెట్‌ ఆమోద ప్రతిని ఇవ్వండి 

14 Jul, 2020 03:09 IST|Sakshi

సచివాలయ భవనాల కూల్చివేత కేసులో హైకోర్టు  ఆదేశం 

15 వరకూ స్టే పొడిగింపు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనుల్ని నిలిపివేయాలని గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఈ నెల 15 వరకూ హైకోర్టు పొడిగించింది. కూల్చేయాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయ భవనాల్ని కూల్చరాదంటూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. భవనాల్ని కూల్చి కొత్తగా నిర్మాణం చేయాలని మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం విధానపరమైనదని, దీని విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. 

గతంలో ఇదే విధంగా తీర్మానం చేసిన దానిపై తాము ఉత్తర్వులు ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. మంత్రివర్గం గత నెల 30న తీర్మానం చేసిన విషయాన్ని గుట్టుగా ఉంచినట్లు అనిపిస్తోందని,, పత్రికల్లో వార్తలు రాలేదని, ప్రభుత్వం కూడా ప్రకటన జారీ చేయలేదని వ్యాఖ్యానించింది. ప్రజలకు చెప్పకపోయినా కోర్టులకైనా తెలియజేయాలని ఆదేశించింది. ప్రజలకు తెలియజేయకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. సీల్డ్‌ కవర్‌లో మంత్రివర్గ తీర్మాన ప్రతిని అందజేయాలని కోరింది. పిటిషనర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ... నిర్మాణాలు, కూల్చివేతలకు ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని, పలు చట్టాలను ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడిందని, అనుమతి తీసుకుని కూల్చారో లేదో ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. 

ఈ వాదనను ఏజీ వ్యతిరేకిస్తూ, భవనాల కూల్చివేత పనులు మధ్యలో నిలిచిపోయాయని, వాటిని పూర్తిగా కూల్చేందుకు వీలుగా స్టేను ఎత్తేయాలని కోరారు. మంత్రివర్గ తీర్మాన ప్రతిని ఈరోజే మధ్యాహ్నానికి ఇస్తామని, విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై.. పిటిషనర్‌ వాదనల దాఖలుకు సమయం ఇవ్వాలని, విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా ప్రభుత్వం మంత్రివర్గ తీర్మాన ప్రతిని, పిటిషనర్‌ కౌంటర్‌ రిప్లై్ల దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

మంత్రివర్గం ఆమోదించింది 
ప్రభుత్వం చట్ట ప్రకారమే సచివాలయ భవనాల్ని కూల్చివేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొన్నారు. మంత్రివర్గం జూన్‌ 30న ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. ఆర్‌అం డ్‌బీ ఈఎన్‌సీ అదే నెల 4న 25.50 ఎకరాల్లోని సచివాల య భవనాల కూల్చివేతకు నివేదిక ఇచ్చారని, దీనికి అనుగుణంగా కూల్చివేతలకు జీహెచ్‌ఎంసీ కూడా అనుమతి ఇచ్చిందన్నారు. కాలుష్య సమస్యతో ఎవ్వరూ బాధపడటం లేదని, హుస్సేన్‌సాగర్‌ సమీపంలో కూల్చివేయరాదన్న వాదన చట్ట వ్యతిరేకమని చెప్పారు. నిర్మాణాలు– కూల్చివేతలపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లోని 4(3)ను ఉల్లంఘించలేదన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే పిల్‌ దాఖలు చేశారని, వీటిని కొట్టేయాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు