టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు విడుదల 

15 Jun, 2019 01:30 IST|Sakshi
ఐసెట్‌ ఫలితాలను విడుదల చేస్తున్న పాపిరెడ్డి

92.01 శాతం ఉత్తీర్ణత.. 20లోపు ర్యాంకుల్లో పురుషులదే హవా 

అర్హత సాధించిన ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు  

కేయూ క్యాంపస్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 23, 24 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌–2019 ఫలితాలు విడుదలఅయ్యాయి. వరంగల్‌ అర్బన్‌ కాకతీయ యూనివర్సిటీ హాల్‌లో సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి.. కేయూ వీసీ ఆచార్య ఆర్‌.సాయన్న, టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య సీహెచ్‌ రాజేశం, కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.పురుషోత్తంతో కలిసి ఐసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. 

92.01 శాతం ఉత్తీర్ణత..: టీఎస్‌ ఐసెట్‌కు మొత్తం 49,565 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 44,561మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాశారు. వీరిలో 41,002మంది అభ్యర్థులు(92.01శాతం) ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 22,362 మంది పరీక్షకు హాజరుకాగా 20,696 మంది (92.55శాతం), మహిళలు 22,191 మంది హాజరుకాగా 20,299 మంది (91,47 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక ట్రాన్స్‌జెండర్స్‌ ఎనిమిది మందిలో ఏడుగురు (87.50 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్‌ మల్కాజిగిరికి చెందిన మండవ హనీస్‌ సత్య 160 మార్కులు సాధించి మొదటి ర్యాంకు, హైదరాబాద్‌ మాచారానికి చెందిన ఎన్‌ఎస్‌వీ.ప్రకాశ్‌రావు 159 మార్కులు సాధించి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. కాగా, 20 ర్యాంకుల్లోను అబ్బాయిలదే పైచేయిగా ఉంది. ఇక 5, 11, 19, 20వ ర్యాంకులు మహిళలు సాధించారు. కాకతీయ వర్సిటీ ఎనిమిదోసారి టీఎస్‌ ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహించడంపై వీసీ, రిజిస్ట్రార్, ఐసెట్‌ కన్వీనర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అభినందించారు. 

మరిన్ని వార్తలు