టెండర్‌ గోల్‌మాల్‌..!

22 Oct, 2019 08:38 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 అద్దె బస్సులు.. 11 ఎక్స్‌ప్రెస్, 7 ఆర్డినరీ బస్సుల కోసం టీఎస్‌ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. ఉమ్మడి జిల్లాలోని పలువురు ఔత్సాహికులు ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం ఆర్‌ఎం కార్యాలయానికి చేరుకున్నారు. టెండర్‌ ప్రకటనలో పేర్కొన్న విధంగా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమై వచ్చిన దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారం పూరించి టెండర్‌ వేశారు. 

దరఖాస్తుదారులకు చుక్కెదురు..
టెండర్‌లో సామాన్యులు సైతం అర్హులేనని పేర్కొనడంతో సాధారణ వ్యక్తులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే వారికి చుక్కెదురైంది. సాఫీగా సాగుతున్న టెండర్ల ప్రక్రియలో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. టెండర్‌లో పేర్కొనట్లు సాధారణ వ్యక్తులకు కాకుండా, బస్సులు కలిగిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు పేర్కొనడంతో అధికారులు, దరఖాస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టెండర్‌లో మార్పు చేసిన నిబంధనలను తెలపకుండా దరఖాస్తులు స్వీకరించడంపై అధికారులపై మండిపడ్డారు.

అధికారులకు, దరఖాస్తుదారులకు మధ్య వాగ్వాదం..
టెండర్లలో భాగంగా సుమారు 1500 పై దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయగా, దరఖాస్తు ముగిసే సమయానికి సైతం దరఖాస్తుదారులు అధికంగా ఉండడంతో వారి వివరాలు నమోదు చేయకుండా, ఎలాంటి టోకెన్‌ ఇవ్వకుండా 50 శాతం పై మంది నుంచి నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు స్వీకరించారని దరఖాస్తుదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కో దరఖాస్తు నుంచి రూ. 2 వేలు నాన్‌ రిఫండబుల్, రూ. 50 వేల రిఫండబుల్‌ సొత్తు వసూలు చేశారన్నారు. 

కొలిక్కిరాని దరఖాస్తు ప్రక్రియ..
నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించాలి. అనంతరం 3 గంటల వరకు టెండర్లు ఓపెన్‌ చేసి అనంతరం వారి వివరాలు ప్రకటించాలి. కాని మార్పు చేసిన నియమాలు తెలియడంతో దరఖాస్తు చేసుకున్న సాధారణ వ్యక్తులు (బస్సులు లేని వారు) ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని నోటిస్‌ బోర్డుపై పేర్కొంటే తాము దరఖాస్తు చేసుకునేవారమే కాదని, దరఖాస్తులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో రాత్రి 9 గంటలు దాటినా ప్రక్రియ పూర్తి కాలేదు. డీఎస్పీ, ఆర్డీవోలు జోక్యం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు