నల్లమల పర్యాటకానికి రూ.56.84 కోట్లు

14 Mar, 2020 02:38 IST|Sakshi

పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నల్లమలలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అక్కడ ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు అవకాశముందని, ఆ దిశగా ప్రణాళిక లు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మల్లెల తీర్థం వెళ్లడానికి రహదారి నిర్మించాల్సి ఉన్నా.. అటవీ చట్టాలు ప్రతిబంధకంగా ఉన్నా యన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. నల్లమల పర్యాటకాభివృద్ధికి రూ.56.84 కోట్లు మంజూరు చేశామని, ఇందులో అక్క మహాదేవి గుహలకు రూ.1.25 కోట్లు, కడలివనం కోసం రూ.11.04 లక్షలు, ఈగలపెంటకు రూ.25.94 కోట్లు, ఫర్హాబాద్‌కు రూ.13.81 కోట్లు, మల్లెల తీర్థానికి రూ.5.35 కోట్లు, ఉమామహేశ్వర దేవాలయానికి రూ.10.35 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. 

ఓవర్‌సీస్‌ విద్యానిధికి ఆర్థిక సాయం పెంచం
ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం పెంచే యోచన లేదని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టంచేశారు. అలాగే సీఎం ఓవర్‌సీస్‌ విద్యానిధి కింద నిర్దేశించిన కోటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలేదని, దీంతో కొత్తగా పెంచాల్సిన ఆవశ్యకత లేదన్నారు. సభ్యులు షకీల్‌ అమీర్‌ మహ్మద్, మెతుకు అనంద్, స్టీఫెన్‌సన్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. 

లాభాల బాట పడితే కొత్త డిపోల మాట
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని, ఇదే ఒరవడిని కొనసాగిస్తే కొత్త డిపోలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. గత మూడు నెలలుగా అనేక సంస్కరణలు తీసుకురావడంతో ఆర్టీసీ క్రమంగా లాభాల్లోకి వస్తోందని, నిర్వహణావ్యయం తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల స్థానంలో 1,334 అద్దెబస్సులను ప్రవేశపెడుతామన్నారు. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసాలను తొలగించడానికి ఇటీవల చార్జీలను పెంచామని నష్టాలనుంచి గట్టెక్కామని చెప్పారు. 
 

మరిన్ని వార్తలు