మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

29 Jun, 2019 10:35 IST|Sakshi
మాట్లాడుతున్న రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ  మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 మైనారిటీలకు సబ్సిడీపై కార్ల పంపిణీ

రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ  మంత్రి కొప్పుల ఈశ్వర్‌   

సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగిస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం హజ్‌హౌస్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో జరిగిన డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం దేశంలో రూ. 4వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించగా  తెలంగాణ రాష్ట్రంలోనే రూ. 2 వేల కోట్లు  కేటాయించి  మైనారిటీ  సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు. నిధులను పూర్తిగా వినియోగించి  మైనారిటీల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు.  మైనారిటీ సంక్షేమానికి షాదీముబారక్,  మసీదుల నిర్మాణం, మరమ్మతులు, ఇమాంలకు పారితోషికం, స్వయం ఉపాధి పథకాలు, మైనారిటీ గురుకులాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు.

 డైవర్‌ ఎంపవర్‌మెంట్‌  కార్యక్రమం కింద  ప్రభుత్వ సబ్సిడీతో మైనారిటీ యువతకు  కార్లను అందజేసి వారి జీవనోపాధికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌  సౌజన్యంతో కార్ల వితర ణ కార్యక్రమం  చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న  వసతిని వినియోగించుకొని వారి జీవితాలను మెరుగుపర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. మైనారిటీ సంక్షేమ పథకాల అమల్లో  ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని  వెంటనే  పరిష్కరించేందుకు  కృషి చేస్తామన్నారు.  

దేశంలోనే తెలంగాణ ఆదర్శం...
దేశంలోనే మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మైనారిటీ విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మైనారిటీ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని  తమ జీవితాలను  దిశా నిర్ధేశం  చేసుకోవాలని  సూచించారు.

 నాంపల్లి శాసన సభ్యుడు జాఫర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో  వినియోగించేలా  చర్యలు చేపట్టాలని  కోరారు.  డ్రైవర్‌ ఎంపవర్‌ మెంట్‌ కార్యక్రమాన్ని మరింత విస్తరించి పెద్ద సంఖ్యలో  మైనారిటీలకు అందేలా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖాధికారులను కోరారు.  

కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్, ఉర్దూ అకాడమీ చైర్మన్‌  అన్సారీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సలీమ్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్‌ దత్‌ ఏక్కా,  ఎంఎఫ్‌సీ ఎండీ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా  67 మంది మైనారిటీ యువకులకు కార్లను పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు