ఏ క్షణంలోనైనా అశోక్‌ అరెస్టు!

7 Mar, 2019 19:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్‌లో ప్రధాన నిందితుడు అశోక్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి కదలికలకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడం న్యాయ వ్యవస్థను తప్పు పట్టించడమేనన్నాయి. ఇందుకు సంబంధించి ఏపీలో కేసు నమోదైనా అది చట్టపరంగా నిలవదని పేర్కొన్నాయి. పరారీలో ఉన్న నిందితుడికి ఆశ్రయం కల్పించడమే కాకుండా.. అతడిని నిర్దోషిగా నిరూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు న్యాయపరంగా చెల్లేవి కావని తెలిపాయి. నిందితుడిని చట్టం నుంచి కొన్నాళ్లు కాపాడినా చివరికి అతడు కోర్టు బోను ఎక్కక తప్పదని... చట్ట పరిధిలోనే తమ విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశాయి. చదవండి : (అశోక్‌ అమరావతిలో ఉన్నా..అమెరికాలో ఉన్నా...)

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ మాదాపూర్‌ పోలీసులకు లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఈనెల 2న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్‌ పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీగ్రిడ్‌ సంస్థపై దాడులు చేసి కొన్ని కంప్యూటర్లు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. 120(బీ), 379, 420, 188తోపాటు ఐపీసీ 72, 66(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కేసు కావడంతో.. విచారణ నిమిత్తం హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.(డేటా చోరీ ప్రకంపనలు.. తస్మాత్‌ జాగ్రత్త!)

మరిన్ని వార్తలు