సమ్మె విషాదం

11 Oct, 2019 13:16 IST|Sakshi
ఖలీల్‌మియా (ఫైల్‌) కొమరయ్య (ఫైల్‌) రఘు (ఫైల్‌)

గుండెపోటుతో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు మృతి  

భార్య ఉద్యోగం పోయిందనే బెంగతో భర్త...  

కొనసాగుతున్న నిరవధిక సమ్మె  

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు  

సాక్షి, సిటీబ్యూరో/రాయదుర్గం/మేడిపల్లి/అల్వాల్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం ఆరో రోజుకు చేరింది. గురువారం మరింత ఉధృతమైంది. మరోవైపు తిరిగి నగరానికి చేరుకుంటున్న ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమ్మెపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె చేస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సమ్మె కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చెంగిచెర్ల డిపోకు చెందిన డ్రైవర్‌ కొమురయ్య ఉప్పల్‌ డిపో వద్ద నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న తరువాత గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అల్వాల్‌లో హకీంపేట్‌ డిపోకు చెందిన కండక్టర్‌ పద్మ  భర్త గుండెపోటుతో చనిపోయాడు. మరోవైపు హెచ్‌సీయూ డిపోకు చెందిన డ్రైవర్‌ ఖలీల్‌మియా సైతం రామచంద్రాపురం ఈఎస్‌ఐ వద్ద గుండెపోటుతో చనిపోయాడు. వీరికి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. 

ఉద్యోగం పోయిందనే బెంగతో...  
హెచ్‌సీయూ డిపోకు చెందిన సీనియర్‌ డ్రైవర్‌ ఎస్‌కె ఖలీల్‌మియా(48) గుండెపోటుతో మృతి చెందాడు. కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తీవ్ర భయాందోళనతో గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖలీల్‌మియా మృతితో హెచ్‌సీయూ డిపోలో విషాద వాతావరణం నెలకొంది. ఆయనకు భార్య, నలుగురు పిల్లలున్నారు. రామచంద్రాపురంలోని ముంబై కాలనీలో నివాసముంటున్నారు. బుధవారం మధ్యాహ్నం తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో చందానగర్‌లోని అర్చన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.  

గుండెపోటుతో మరో డ్రైవర్‌...  
ఉప్పల్‌ డిపో ఎదుట గురువారం ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. చెంగిచెర్ల డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కొమరయ్య (57) ఇందులో పాల్గొన్నాడు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బోడుప్పల్‌ మల్లికార్జున్‌నగర్‌లోని తన నివాసానికి వెళ్లాడు. సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, ఉద్యోగ భద్రత తదితర కారణాలతో తీవ్ర మనస్తాపానికి గురైన కొమరయ్య గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు భార్య బుచ్చమ్మ తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొమరయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 

మరో ఘటనలో ఆర్టీసి ఉద్యోగి భర్త...   
ఆర్టీసి ఉద్యోగి పద్మ భర్త రఘు హఠాన్మరణం పట్ల ఆర్టీసీ జేఏసీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హకీంపేట్‌ డిపొలో కండక్టర్‌గా పనిచేస్తున్న అల్వాల్‌కు చెందిన పద్మ భర్త రఘు గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. ఒకవైపు భార్య ఉద్యోగం కోల్పోవడం.. జీతం రాకపోవడంతో నెలసరి చెల్లించే రుణ వాయిదా చెక్కు బ్యాంకులో బౌన్స్‌ కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ఈ ఒత్తిడితోనే  రఘుకు గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. 

సమ్మె ఉధృతం
ఆర్టీసీ కార్మికులకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మదద్దతు పలకడంతో సమ్మె ఉధృతమైంది. నగరంలోని అన్ని డిపోల వద్ద గురువారం ధర్నాలు నిర్వహించారు. ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు పలు చోట్ల మానవహారాలు ఏర్పాటు చేశారు. పలు డిపోల నుంచి ప్రధాన రహదారుల వరకు ర్యాలీలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. పలుచోట్ల ప్రైవేట్‌ వాహనాలను అడ్డగించారు. అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, మహిళా కండక్టర్లు సైతం నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. దిల్‌సుఖ్‌నగర్, కోఠి, ఉప్పల్, మిధానీ, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, కుషాయిగూడ, ఈసీఐఎల్, కంటోన్మెంట్, పికెట్, మేడ్చల్, బర్కత్‌పురా, హెచ్‌సీయూ, హయత్‌నగర్, మియాపూర్, రాణీగంజ్, ముషీరాబాద్, చెంగిచెర్ల తదితర అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. పోలీసులు అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా