ఎలక్ట్రిక్‌ బస్సులు తొలుత ఇక్కడేనా? 

29 Jan, 2019 02:05 IST|Sakshi

హైదరాబాద్‌లో పూర్తిగా సిద్ధమైన వ్యవస్థ

బస్సులు రెడీ, రెండు డిపోల్లో చార్జింగ్‌ స్టేషన్లు 

కరెంటు సరఫరా లేక కదలని చక్రాలు

సాక్షి, బిజినెస్‌ బ్యూరో: చిన్న, చిన్న సమస్యలు తొలగిపోతే పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ బస్సుల్ని నడుపుతున్న తొలి రాష్ట్రమనే గౌరవం తెలంగాణకే దక్కనుంది. ఎందుకంటే దేశంలో ‘ఎలక్ట్రిక్‌ మొబిలిటీని వేగంగా అందిపుచ్చుకునే పథకం(ఎఫ్‌ఏఈఎం)’అర్హత పొందిన 10 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఇన్‌ఫ్రాను సమకూర్చుకున్నది తెలంగాణ ఒక్కటే. ఇక్కడ మాత్రమే పూర్తిస్థాయిలో బస్సులు, చార్జింగ్‌ వ్యవస్థ, దానికి కావాల్సిన విద్యుత్‌ సదుపాయాలు సిద్ధమయ్యాయి. అశోక్‌ లేలాండ్‌ చేజిక్కించుకున్న గుజరాత్‌లోగానీ, టాటాలు దక్కించుకున్న మరో 4 రాష్ట్రాల్లోకానీ ఈ వ్యవస్థ ఇంకా సిద్ధం కాలేదు.  

ఎఫ్‌ఏఈఎం పథకంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఎలక్ట్రిక్‌ బస్సుల్ని నడిపే అవకాశం ఇక్కడి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సంస్థకు దక్కింది. ఈ మేరకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్న ఒలెక్ట్రా.. టీఎస్‌ఆర్టీసీకి ఇప్పటికే 40 బస్సుల్ని సరఫరా చేసింది. వీటి కోసం హైదరాబాద్‌లోని మియాపూర్, జుబ్లీ బస్టాండ్లలో చార్జింగ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసింది. మియాపూర్‌ డిపోలో ఇప్పటికే ట్రయల్‌ రన్‌ మొదలుకాగా జుబ్లీ బస్టాండ్‌లో మాత్రం ఇంకా కరెంటు సదుపాయం అందకపోవటంతో ఈ బస్సులు పరుగుకు నోచుకోవటం లేదు.
 
ఒక్కసారి చార్జ్‌ చేస్తే 300 కి.మీ. 
టీఎస్‌ఆర్టీసీకి ఒలెక్ట్రా సరఫరా చేసిన బస్సుల సైజు కాస్త పెద్దది. దీనిలో ఏసీతోపాటు అత్యాధునిక వీడియో రికార్డింగ్, దూరం–సమయాన్ని కలిపి లెక్కించుకుని ఎప్పుడు, ఎక్కడికి వెళ్తుందో చెప్పగల వ్యవస్థ ఉంది. దివ్యాంగుల కోసం వీల్‌చెయిర్‌ వంటి సౌకర్యాలూ ఉన్నాయి. ఒకసారి చార్జ్‌ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ తిరుగుతాయి. నిజానికి 400 కిలోమీటర్ల వరకూ తిరుగుతాయని, కానీ నగరంలో నెలకొన్న పరిస్థితుల్లో 300 మాత్రమే లెక్క వేస్తున్నామని ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ప్రతినిధితో ఒలెక్ట్రా అధికారి ఒకరు చెప్పారు. కిలోమీటర్‌కు అయ్యే చార్జీ తక్కువ కనక ఈ 40 బస్సుల వల్ల ఏడాదికి రూ.40 కోట్ల వరకూ ఆదా అయ్యే అవకాశముందని ఆర్టీసీ వర్గాలు చెప్పాయి. ఈ బస్సులతోపాటు మినీబస్సులను కూడా ఒలెక్ట్రా తయారు చేస్తోంది. ఒకసారి ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అంటూ నగరంలో మొదలైతే అది కాలుష్య నియంత్రణకు ఉపకరించటంతో పాటు మరిన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు తిరగడానికి దారులు వేస్తుందన్నది ప్రయాణికుల భావన.    

మరిన్ని వార్తలు