ఖాళీల లెక్కలు

10 Oct, 2019 01:44 IST|Sakshi

ఏయే పోస్టులు, ఎన్నింటికి నోటిఫికేషన్‌.. అనే విషయంపై మల్లగుల్లాలు

రెండ్రోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం ఆదేశంతో

చర్యలు వేగిరం చేసిన యంత్రాంగం  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె విషయంలో రెండు పక్షాలు పట్టువీడటం లేదు.  తమ డిమాండ్ల పరిష్కారం జరిగే వరకు ఆందోళన చేస్తామని కార్మిక సంఘాలు భీష్మించుకోగా, ప్రభుత్వం కూడా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. సమ్మెలో భాగంగా బుధవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీల మద్దతు కోరగా, ఇప్పటికే సీఎంకు రవాణా కార్యదర్శి సునీల్‌ శర్మ నివేదిక సమర్పించారు. సీఎం ఆదేశాలతో ఉద్యోగ ఖాళీల లెక్కలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు పక్షాల పరిస్థితి ఇలా ఉంటే ప్రయాణికుల కష్టాలు ఐదో రోజు కూడా కొనసాగాయి. సెలవులు అయిపోతుండటంతో తిరుగు ప్రయాణాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వస్తున్న వారి నుంచి ప్రైవేటు వాహనాలు రెట్టిం పు చార్జీలు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి.

ఖాళీల భర్తీకి తర్జనభర్జన..
సీఎం ఆదేశాలతో ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీల లెక్కలపై అధికారగణం తర్జనభర్జన పడుతోంది. ఆర్టీసీలో కేటగిరీల వారీగా ఎన్ని ఖాళీలున్నాయి? అనే అంశంపై అంచనాలు తయారు చేస్తున్నారు. మూడు పద్ధతుల్లో బస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎంతమంది కార్మికులు అవసరమనే అంశంపైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మొత్తం 50వేల మంది వరకు కార్మికులున్నారు. డ్రైవర్, కండక్టర్‌ కేటగిరీల్లో 1,200 మందే ఉన్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఈ నేపథ్యంలో మిగతా ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఆర్టీసీ ద్వారా 10వేల బస్సులు నడపాలని నిర్ణయించగా.. ఇందులో 50శాతమే పూర్తిస్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 30శాతం అద్దె ప్రాతిపదికన, మరో 20% పూర్తిగా ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 50% బస్సులకు మాత్రమే డ్రైవర్లు, కండక్టర్లు ఉంటే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 97 బస్‌ డిపోల పరిధిలో 5వేల బస్సులకు సిబ్బంది కావాలి. ప్రతి బస్సు కు ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ల చొప్పున గణిస్తే 20వేల మంది సరిపోతారని లెక్కలు వేస్తున్నా రు. శ్రామికుల కేటగిరీలో 4వేల మందితో పాటు సూపర్‌వైజ్‌ కేడర్‌లో మరో 400 పోస్టులు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 28వేలమందిని నియమిస్తే సరిపోతుందనే దానిపై ఆర్టీసీ అధికారుల్లో చర్చలు జరుగుతున్నాయి.

కొత్తగూడెం బస్సు డిపో వద్ద మోకాళ్లపైనిల్చుని నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

సీఎం ఆమోదం తర్వాతే...
ఆర్టీసీలో ఖాళీలు, నియామకాలపై రెండ్రోజల్లో లెక్కలు తేల్చేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా అన్ని వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అన్నింటిపైనా స్పష్టత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలకు సీఎం ఆమోదించిన తర్వాత నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.

టికెట్‌ ధరకు రెట్టింపు వసూలు..
దసరా పండుగకు ఊరెళ్లిన వారు క్రమంగా తిరుగుప్రయాణమవుతుండటంతో రద్దీ పెరుగుతోంది. ఈ నెల 5న సమ్మె ప్రారంభమవుతుందని ముందే ప్రకటించడం... విద్యా సంస్థలకు అంతకుముందే సెలవులు రావడం తో ఊరికి వెళ్లేవారు ప్రణాళికతో వ్యవహరించారు. దీంతో పండుగకు ఊరెళ్లిన వారిపై ఆర్టీసీ సమ్మె పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం ప్రయాణికులు క్రమంగా వెనుతిరుగుతుండటంతో డిమాండ్‌ పెరుగుతోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో కొన్ని బస్సులను ఆర్టీసీ నిర్వహిస్తున్నప్పటికీ డిమాండ్‌కు సరిపడా బస్సులు రోడ్డెక్కడం లేదు. ఈ నేపథ్యంలో పల్లెలకు వెళ్తున్న ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల చేతిచమురు వదిలిస్తున్నారు. సాధారణ బస్సు టికెట్లు కంటే రెట్టిం పు వసూళ్లు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. గురు, శుక్ర, శనివారాల్లో రద్దీ విపరీతం కానుంది. ఈ సమయంలో ఆర్టీసీ మరిన్ని బస్సులు నడిపితే తప్ప ఇబ్బందులకు ఉపశమనం ఉండదు.

తాత్కాలిక సిబ్బందిపై ఆర్టీసీ కార్మికుల దాడి 
నారాయణఖేడ్‌: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లపై రెగ్యులర్‌ కార్మికులు చేయిచేసుకున్నారు. బుధవారం సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్‌ రాజీవ్‌చౌక్‌ చౌరస్తా నుంచి సంగారెడ్డికి బయలుదేరింది. అందులో స్థానిక ఆర్టీసీ కార్మికులు ఎక్కారు. బస్సు చార్జీ అడిగిన తాత్కాలిక కండక్టర్‌ను తాము స్టాఫ్‌ అని చెప్పారు. పాసులు చూపించాలని కోరగా..డిపో వద్ద చూపిస్తామని చెప్పారు. డిపోనకు వెళ్లగానే కార్మికులు తాత్కాలిక కండక్టర్‌ సాయిబాబ, డ్రైవర్‌ దత్తుపై చేయిచేసుకున్నారు. 

మరిన్ని వార్తలు