ఉధృతంగా సమ్మె.. ఖమ్మంలో ఉద్రిక్తత

13 Oct, 2019 10:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు యత్నించడంతో ఆర్టీసీ సంఘాలు ఆదివారం బస్సుల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఖమ్మం, మణుగూరు సహా ఆరు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్‌, వామపక్షాలు మద్దతు ఇచ్చాయి.

హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌ పాతబస్తీలో డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఫలక్‌నుమ, ఫారూఖ్‌నగర్‌ డిపోల ముందు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు బీజేపీ, సీఐటీయూలు తమ మద్దతు తెలిపాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విక్రమ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హక్కింపేట్‌ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆయన ధర్నా చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు లాభాల బాటలో నడిపించేందుకు కృషిచేయాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగులున తొలగించి వారి కుటుంబాలను రోడ్డు పడేయడం దుర్మార్గమన్నారు.

ఇబ్రహీంపట్నం డిపో వద్ద
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో కార్మికులు.. ఆందోళన కొనసాగిస్తున్నారు. నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. డిపో ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

హన్మకొండలో మౌనదీక్ష
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకుని హన్మకొండలోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర మౌనదీక్షకు దిగారు. తమ డిమాండ్లు న్యాయమైనవని... తమ పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. జనగామ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జనగామ ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు మౌనప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయకపోతే... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకుని భూపాలపల్లిలో అంబేద్కర్‌ విగ్రహం దగ్గర మౌనదీక్ష చేశారు. ప్రభుత్వం పంతం వీడి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిజామాబాద్‌లో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి డిపో వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేదిలేదని స్పష్టం చేశారు.

నల్ల బ్యాడ్జీలతో మౌనప్రదర్శన
తమ డిమాండ్ల నెరవేర్చాలంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. పట్టనంలో భారీ ర్యాలీ చేశారు. అఖిలపక్షం నాయకులు కార్మికులకు మద్దతుగా మద్దతుగా నిలిచారు. ప్రైవేట్ డ్రైవర్లు, కండెక్టర్లతో బస్సులను నడిపిస్తుంటే... ప్రజలు క్షేమం గాల్లో దీపంలా ఉందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ డిమాండ్‌ చేశారు. కార్మికులు సమ్మె చేస్తుంటే... ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు.. నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అఖిలపక్షం నేతలు కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ కార్మికుల బతుకులతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు