ఆర్టీసీ సమ్మెకు రాజకీయ తోడ్పాటు

12 Oct, 2019 02:28 IST|Sakshi

రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని జేఏసీ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం చేయాలని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నిర్ణయించింది. వరుసగా 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు తావులేకుండా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు.. సమ్మెపై ఎక్కడా తగ్గబోమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరింత వాడిగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని భావించిన జేఏసీ.. ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో జేఏసీ నేతలు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందిస్తూ ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొంటారని, ఈ మేరకు పీసీసీ తరఫున పిలుపునిస్తామని చెప్పారు.

కేంద్ర హోం శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని పలువురు ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. అనంతరం టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కలిశారు. లక్ష్మణ్‌ స్పందిస్తూ ఆర్టీసీ సమ్మెను తమ భుజాలపై ఎత్తుకుని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని బస్సు డిపోల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిని పంపుతామని లక్ష్మణ్‌ తెలిపారు.

నేడు మౌనదీక్షలు.. 
ఆర్టీసీ జేఏసీ కార్యాచరణలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను తీవ్ర తరం చేయనున్నారు. ప్రతిరోజు ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా.. శనివారం గాంధీ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపట్టనున్నారు.  తాలూకా కేంద్రాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలసి వినతిపత్రాలు సమర్పించనుంది. శుక్రవారం కరీంనగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలసిన పలువురు వినతులు ఇచ్చే క్రమంలో ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో ఆర్టీసీ కార్మికులపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ర్యాలీల జోరు.. నినాదాల హోరు! 
ఆర్టీసీ కార్మికుల 7వ రోజు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, జిల్లా కేంద్రా ల్లో ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ కార్మికులతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి. జేఏసీ నేతలు తమ డిమాండ్లను పేర్కొంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాచోట్ల రాస్తారోకోలు చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మెజార్టీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రయాణికుల తాకిడికి సరిపడా బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నా అనుభవజ్ఞులైన డ్రైవర్లు దొరకట్లేదు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా