‘ఇస్టా’ ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ కేశవులు

3 Jul, 2019 08:31 IST|Sakshi

ప్రపంచ వేదికపై తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవం

2022–24 మధ్య అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న కేశవులు

ప్రస్తుతం తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థకు డైరెక్టర్‌

అభినందనలు తెలిపిన    మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) ఉపాధ్యక్షుడిగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.కేశవులు ఎన్నికయ్యారు. భారతదేశానికి, అందునా తెలంగాణకు ప్రపంచ వేదికపై దక్కిన అరుదైన గౌరవంగా వ్యవసాయశాఖ వర్గాలు అభివర్ణించాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా విత్తన చట్టాలను, పాలసీలను, మార్కెట్‌లో విత్తన నాణ్యత, నియంత్రణ, సరఫరా మొదలగు అంశాలన్నింటిలో తీసుకునే కీలక నిర్ణయాలలో ప్రధానపాత్ర పోషించే ఇస్టా కార్యనిర్వాహక కమిటీ ఎన్నిక మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. జూన్‌ 26 నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ విత్తన సదస్సు– 2019 నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇస్టా అత్యున్నత కమిటీలో ప్రెసిడెంట్, వైస్‌ ప్రెసిడెంట్‌తోపాటు 8 మంది సభ్యులు ఉంటారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి వివిధ దేశాల ప్రతినిధుల ద్వారా ఈ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి తెలంగాణకు చెందిన డాక్టర్‌ కె.కేశవులు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1924లో ఏర్పాటైన ఈ సంస్థలో భారతదేశానికి ఉపాధ్యక్ష పదవి లభించడం ఇదే మొదటిసారి. ఇస్టా ఉపాధ్యక్షుడిగా కేశవులు ఎన్నికవ్వడం భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి పేర్కొన్నారు. భారతదేశ విత్తనరంగంలో ఈ దశాబ్దకాలంలో వివిధ దేశాలకు దీటుగా, దేశ అవసరాలకు సరిపడా విత్తనోత్పత్తి చేస్తూ, వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న తరుణంలో ఈ స్థానం సంపాదించడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఇస్టా సంస్థ ఉపాధ్యక్షుడిగా 2019–22 వరకు కేశవులు కొనసాగుతారు. సంస్థ నిబంధనల ప్రకారం ఇస్టా ఉపాధ్యక్షుడే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అంటే 2022–24 మధ్య ఇస్టా అధ్యక్షుడిగా డాక్టర్‌ కేశవులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇస్టా సంస్థ వందేళ్ల కార్యక్రమం కేశవులు నేతృత్వంలోనే జరిగే అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా మన దేశం ముఖ్యంగా తెలంగాణ నుంచి వివిధ దేశాలకు విత్తనాలు ఎగుమతులు చేసుకోవడానికి దోహదపడనుంది. అంతేకాకుండా విత్తన పరీక్షలో పద్ధతులు, నాణ్యత పెరిగి విత్తన చట్టాలను, పాలసీలను రూపొందించడానికి ఉపయోగపడనుంది. 

తెలంగాణ బిడ్డ... 
డాక్టర్‌ కేశవులు ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తెలంగాణకు గర్వకారణం. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కేశవులు ఇంటర్మీడియట్‌ వరకు వరంగల్‌ జిల్లాలో విద్యను అభ్యసించి, వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీని పొంది, తమిళనాడులోని కోయంబత్తూరు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, డేవిస్, అమెరికాలో పోస్ట్‌ డాక్టరల్‌ పరిశోధన చేసి విత్తన శాస్త్రంలో అత్యంత అనుభవం గడించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో విత్తన శాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థలో, విత్తనాభివృద్ధి సంస్థలో సంచాలకులుగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ విత్తన ప్రముఖుడైన ప్రొఫెసర్‌ కెంట్‌ బ్రాడ్‌ఫోర్డ్‌తో కలిసి పనిచేశారు. యూఎస్‌ఏఐడీ భాగస్వామ్య సభ్యుడిగా ఉండి ఈస్ట్‌ ఆఫ్రికన్, సౌత్‌ ఆసియా దేశాలలో విత్తన పద్ధతుల అభివృద్ధిపై అధ్యయనం చేశారు. విత్తన నిల్వలో ఆహారధాన్యాల నష్టాన్ని తగ్గించి అంతర్జాతీయంగా అంగీకరించిన వినూత్న విత్తన నిల్వ పద్ధతులను కనుగొన్నారు. ఇస్టా, ఓఈసీడీ నేపాల్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ కౌన్సిల్, ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సీఏబీఐ ఆఫ్రికా, సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీస్‌ ఆఫ్‌ టాంజానియా, బంగ్లాదేశ్‌లతో కలిసి విత్తన రంగ అభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో, 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో కేశవులు కీలకపాత్ర పోషించారు. కేశవులు ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడంతో తెలంగాణకు అనేక అవకాశాలు లభిస్తాయంటున్నారు. విత్తన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇతర దేశాలతో భాగస్వామ్యం కావడానికి మంచి అవకాశం లభించనుంది.

ఇస్టా నూతన కార్యవర్గం 
అధ్యక్షుడు : స్టీవ్‌ జోన్స్‌ (కెనడా) 
ఉపాధ్యక్షుడు : డాక్టర్‌ కె.కేశవులు (తెలంగాణ, భారత్‌) 
కార్యవర్గ సభ్యులు : క్లెయిడ్‌ ముజాజు (జింబాబ్వే); వాలేరి కొకరేల్‌ (యునైటెడ్‌ కింగ్‌డమ్‌); శైల్వీ డ్యూకోర్నో (ఫ్రాన్స్‌); బెర్టా కిల్లర్‌మన్‌ (జర్మనీ); రిటాజెకెనెల్లీ (ఇటలీ); రూయెల్‌ సి.గెస్‌ముండో (ఫిలిప్పైన్స్‌); లీనా పియెట్‌ల్లా (ఫిన్లాండ్‌); ఇగ్నోషియో అర్నషియాగ (అర్జెంటీనా)

మరిన్ని వార్తలు