‘భగీరథ’ భారం తగ్గించండి

12 Jun, 2019 03:00 IST|Sakshi

ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి ఎర్రబెల్లి

ఢిల్లీలో జల్‌శక్తి సదస్సుకు హాజరు

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథ ప్రాజెక్టును చేపట్టి విజయవంతంగా అమలు చేస్తోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన రూ.45 వేల కోట్ల అప్పుల భారా న్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కేంద్ర జల శక్తి మం త్రిత్వ శాఖ తాగునీటి సంరక్షణ, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌పై మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఈ సదస్సుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షత వహించగా, సదస్సుకు అన్ని రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు.

అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ తాగునీటి సరఫరా, స్వచ్ఛతకు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకొనేందుకు కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి రాష్ట్రం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీ బండా ప్రకాశ్, సంబంధిత శాఖాధికారులు హాజరయ్యారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టును అన్ని రాష్ట్రాల అధికారులు పర్యవేక్షించి అభినందించారని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి వివరించారు. మంత్రి ఎర్రబెల్లి మంగళవారం సాయంత్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో భేటీ అయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు.  

ఉపాధి హామీ నిధులు విడుదల చేయండి
ఉపాధి హామీ పథకం కింద 2018–19 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణకు కేంద్రం నుంచి విడుదల కావాల్సిన రూ. 760 కోట్ల మెటీరియల్‌ కాంపోనెట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని నరేంద్రసింగ్‌ తోమర్‌ను మంత్రి ఎర్రబెల్లి కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రిని కలసిన ఎర్రబెల్లి ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే రైతులకు వ్యవసాయాన్ని లాభాసాటి చేసేందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడాన్ని పరిశీలించాలని కోరారు.

మరోవైపు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామీణ స్థానిక సంస్థలకు 2017–18 ఏడాదికిగానూ విడుదల కావాల్సిన పెర్ఫార్మెన్స్‌ గ్రాంట్స్‌ రూ. 119 కోట్లు, 2018–19 ఏడాదికిగానూ విడుదల కావాల్సిన రూ. 135 కోట్ల నిధులను మంజూరు చేయాలని కోరారు. ఇక పాత వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి మండలాన్ని రూర్బన్‌ క్లస్టర్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. మంత్రితోపాటు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు