పరిశ్రమలకు ‘మహా’ ఆకర్ష!

22 Mar, 2017 03:44 IST|Sakshi
పరిశ్రమలకు ‘మహా’ ఆకర్ష!

పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న మహారాష్ట్ర పారిశ్రామిక విధానం
మహారాష్ట్ర పాలసీ నుంచి తెలంగాణ స్ఫూర్తి పొందాలి
టీఎస్‌ఐపాస్‌ పారిశ్రామిక పురోగతిపై ఫ్యాప్సీ నివేదికలో సిఫారసు


సాక్షి, హైదరాబాద్‌: ‘మహారాష్ట్ర పారిశ్రామిక విధానం కింద పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. మహా రాష్ట్ర పారిశ్రామిక విధానం నుంచి తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తి పొందాలి. మహారాష్ట్ర ప్రభుత్వం తాలూకాలను ఏడు గ్రూపులుగా విభజించి తక్కువ అభివృద్ధి గల ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది’అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, వాణిజ్య సంఘాల సమాఖ్య (ఫ్యాప్సీ) పేర్కొంది.

అభివృద్ధి స్థితిగతుల ఆధారంగా మహారాష్ట్రలో తాలుకాలను ఏ, బీ, సీ, డీ, డీ, పరిశ్రమలు లేని ప్రాంతం, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం అని ఏడు గ్రూపులుగా విభజించారని, సీ, డీ, డీ+, పరిశ్రమలు లేని గ్రూపుల్లోని ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలకు విద్యుత్‌ సుంకాన్ని సైతం ప్రభుత్వం మినహాయించిందని, యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్‌ సుంకం సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపింది. రాష్ట్రంలో రంగారెడ్డి, ఆ తర్వాత మరో నాలుగు జిల్లాల్లోనే పారిశ్రామికీకరణ కేంద్రీకృతమై ఉందని, మిగిలిన జిల్లాల్లో సైతం కొత్త పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర తరహా విధానాన్ని అవలంభించాలని సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రా మిక అభివృద్ధిలో టీఎస్‌–ఐపాస్‌ ప్రభావంపై రూపొందించిన తాజా అధ్యయన నివేదికలో ఫ్యాప్సీ ఈ మేరకు కీలక సిఫారసులు చేసింది. ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు అరుణ్‌ లోకార్ఖ, కార్యదర్శి టీఎస్‌ అప్పారావు, సీనియర్‌ ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్‌తో కలసి అధ్యక్షుడు రవీంద్ర మోదీ మంగళవారం తమ కార్యాలయంలో ఈ నివేదికను ఆవిష్క రించారు. సమ్మిళిత పారిశ్రామికాభి వృద్ధి, సామాజిక సమానత్వం కోసం ఫ్యాప్సీ ఈ నివేదికలో సూచించిన ఇతర సిఫారసులు ఇలా ఉన్నాయి..

ప్రభుత్వం దృష్టిసారించాల్సిన 14 ముఖ్య రంగాలను గుర్తించాం. ఈ రంగాల్లో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సంబంధిత పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి నూతన విధానాలు రూపొందించాలి.

వెనుకబడిన జిల్లాల ప్రజల్లో పారిశ్రామిక, వ్యాపార స్పృహ పెంపొందించేందుకు టీఎస్‌–ఐపాస్‌ ప్రయోజనాల పట్ల ప్రచార, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.

టీ–ప్రైడ్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రా మికవేత్తలకు అందిస్తున్న 50 శాతం సబ్సిడీని వెనకబడిన ప్రాంతాల జనరల్‌ కేటగిరీ పారిశ్రామికవేత్తలకూ విస్తరింపజేయాలి.

ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలను కాటన్‌ జోన్‌గా ప్రకటించి కొత్త స్పిన్నింగ్‌Š మిల్లుల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి.

లెవీ విధానం రద్దుతో నిజామాబాద్‌ జిల్లాలో రైస్‌ మిల్లులు మూతపడుతున్నాయి. ఫుడ్‌ పార్కులు, స్పైస్‌ పార్కుల ఏర్పాటుకు జిల్లా అనువైనది.

గుజరాత్, మహారాష్ట్ర తరహాలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పీపీపీ లేదా ప్రైవేటు యాజమాన్య విధానంలో ఉత్ప త్తుల(ప్రొడక్ట్‌) వారీగా పార్కులు ఏర్పాటును ప్రోత్సహించాలి.

స్థానిక ఐటీఐ, పాలిటెక్నిక్‌ల్లో అందిస్తున్న కోర్సులు స్థానిక పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లు లేవు. అందుకు ఈ సంస్థల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేలా చూడాలి.

ఉద్యోగులు, సిబ్బంది కొరతతో జిల్లా పారిశ్రామిక కేంద్రాల(డీఐసీ)న్నీ పరిశ్ర మలను ప్రోత్సహించడంలో విఫలమైపో తున్నాయి. జిల్లాలు 31కి పెరిగినా ఉద్యోగులను పెంచలేదు. అధికారుల పర్యటనలకు వాహనాలు లేవు. ప్రభుత్వం తక్షణమే నియామకాలు, సదుపాయాలు కల్పించాలి.

టీఎస్‌–ఐపాస్‌తో వృద్ధి రేటు పెరిగింది..
టీఎస్‌–ఐపాస్‌ విధానం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు అనూహ్యంగా పెరిగి రాష్ట్ర వృద్ధి రేటు(జీఎస్‌డీపీ) రెండంకెల మైలురాయికి చేరుకోడానికి దోహదపడిందని ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ కొనియాడారు. గతంలో 52 శాతం పరిశ్రమలు రంగారెడ్డి జిల్లాలోనే కేంద్రీకృతమై ఉండగా, టీఎస్‌ఐపాస్‌ రాకతో ఇతర జిల్లాల్లో కూడా కొత్త యూనిట్ల స్థాపన పెరుగుతోందన్నారు. టీఎస్‌ఐపాస్‌ కింద ఏర్పాటైన యూనిట్లలో 36 శాతం రంగారెడ్డి జిల్లాలో, 14 శాతం మెదక్, 12 శాతం కరీంనగర్, చెరో 9 శాతం వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటయ్యాయన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పరిశ్రమల స్థాపన ఆశించిన రీతిలో లేదన్నారు.

మరిన్ని వార్తలు