వెతికేద్దాం.. వెలికితీద్దాం!

18 Sep, 2019 02:51 IST|Sakshi

ఇసుకతోపాటు ఇతర ఖనిజాదాయంపై టీఎస్‌ఎండీసీ దృష్టి

గ్రానైట్, రోడ్డు మెటల్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

సొంతంగా ‘బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌’ ఏర్పాటుకు యోచన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇసుకతోపాటు ఇతర ఖనిజాల ద్వారా రూ.2,868.95 కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో ఇసుక వాటా రూ.2,837.32 కోట్లు. అయితే, దీర్ఘకాలంలో ఇసుక వెలికితీత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను టీఎస్‌ఎండీసీ అన్వేషిస్తోంది.

టీఎస్‌ఎండీసీకి కేంద్రం ఇదివరకే జాతీయ ఖనిజాన్వేషణ సంస్థ హోదాను కల్పించింది. దీంతో సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్‌ జిల్లాల్లో సున్నపురాయి బ్లాక్‌లలో వెలికితీత పనులను టీఎస్‌ఎండీసీకి అప్పగిస్తూ ఖనిజాన్వేషణ కోసం రూ.29 కోట్లను జాతీయ ఖనిజాన్వేషణ ట్రస్టు కేటాయించింది. సున్నపురాయి అన్వేషణకు సంబంధించి ఇప్పటికే తొలిదశలో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన టీఎస్‌ఎండీసీ.. ప్రస్తుతం రెండోదశలో పూర్తి స్థాయిలో తనకు కేటాయించిన సున్నపురాయి బ్లాక్‌లలో అన్వేషణ ప్రారంభించింది.

గ్రానైట్‌ వ్యాపారానికి మొగ్గు...
నిర్మాణరంగంలో వినియోగించే గ్రానైట్‌కు స్థానికంగా, విదేశీ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రానైట్‌ వ్యాపారంలోకి ప్రవేశించాలని టీఎస్‌ఎండీసీ భావిస్తోంది. దీని కోసం మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌’ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లోని 92.29 హెక్టార్లలో ప్రతీ ఏటా 36,400 క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ను వెలికితీయవచ్చని టెక్నో, కమర్షియల్‌ ఫీజిబిలిటీ నివేదిక ఆధారంగా అంచనాకు వచ్చింది. వంతడుపుల, తాళ్లపూసపల్లె, ఇనుగుర్తి, నమిలిగొండ, కొత్తగట్టులోని రెండుచోట్ల గ్రానైట్‌ నిల్వలున్నట్లు టీఎస్‌ఎండీసీ గుర్తించింది.

రోడ్‌ మెటల్‌ యూనిట్లు...
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిర్మాణరంగం ఊపుమీద ఉండటంతో బండరాళ్ల తరలింపు నిర్మాణదారులకు సమస్యగా మారింది. సహజ ఇసుక వినియోగం పెరగడంతో తరచూ కొరత ఎదురవుతోంది. దీంతో సహజ వినియోగాన్ని తగ్గించేందుకు కృత్రిమ ఇసుక వైపుగా వినియోగదారులను మళ్లించేందుకు టీఎస్‌ఎండీసీ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోడ్‌ మెటల్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖానామెట్, బండరావిరాల, యాచారంలో ఏర్పాటయ్యే ఈ యూనిట్ల ద్వారా కంకర, కృత్రిమ ఇసుకను విక్రయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పర్యావరణ అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఎండీసీ సంయుక్తంగా ప్రయ త్నాలు సాగిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు