గ్రానైట్‌ క్వారీయింగ్‌పై టీఎస్‌ఎండీసీ దృష్టి

2 May, 2019 02:21 IST|Sakshi

ఖమ్మం జిల్లా కామేపల్లిలో డైమన్షనల్‌ స్టోన్‌ నిల్వలు

షెడ్యూలు ఏరియానిబంధనలపై అధ్యయనం

ప్రస్తుతం ఇసుక విక్రయాల ద్వారానే అధిక ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: ఖనిజాన్వేషణ, ఖనిజాల వెలికితీత, క్వారీ లీజుల ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని క్వారీయింగ్‌కు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఇప్పటికే డైమెన్షనల్‌ మార్బుల్‌ డిపాజిట్లను గుర్తించింది. అయితే మార్బుల్‌ నిల్వలు ఉన్న ప్రాంతం షెడ్యూలు ఏరియాలో ఉండటంతో లీజు అనుమతుల్లో సాధ్యాసాధ్యాలపై టీఎస్‌ఎండీసీ అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఖమ్మం జిల్లాల్లో డైమన్షనల్‌ మార్బుల్‌ స్టోన్‌ నిల్వలు ఉన్నాయి.

కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మార్బుల్‌ నిల్వల వెలికితీతను ప్రైవేటు సంస్థలకు లీజు విధానంలో అప్పగించారు. రాష్ట్రంలో గ్రానైట్, మార్బుల్‌కు రోజురోజుకూ డిమాండు పెరుగుతుండగా, భవన నిర్మాణదారులు ఎక్కువగా రాజస్తాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంతోపాటు దక్షిణ భారతదేశంలో మార్బుల్, గ్రానైట్‌కు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని గ్రానైట్, మార్బుల్‌ క్వారీయింగ్‌ను సొంతంగా చేపట్టాలని టీఎస్‌ఎండీసీ నిర్ణయించింది. ఈ మేరకు గ్రానైట్‌ నిల్వలు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఊట్కూరులో ఓ బ్లాక్‌ను కూడా గుర్తించింది. అయితే ఈ ప్రాంతం షెడ్యూలు ఏరియాలో ఉండటంతో క్వారీయింగ్‌ చేపట్టడంపై 1/70 చట్టం నిబంధనలు అడ్డు వస్తున్నాయి.  

డైమన్షనల్‌ స్టోన్‌ నిల్వలపైనా అధ్యయనం 
ఖమ్మం జిల్లాలో నాణ్యమైన బ్లాక్‌ గ్రానైట్, మార్బుల్‌ నిల్వలు ఉన్నట్లు 80వ దశకం ఆరంభంలోనే గనులు, భూగర్భ వనరుల శాఖ గుర్తించింది. 22 మైళ్ల పొడవు, 1.5 మైళ్ల వెడల్పు, 200 మీటర్ల లోతు కలిగిన నిల్వల నుంచి 92 లక్షల క్యూబిక్‌ మీటర్ల డైమన్షన్‌ స్టోన్‌ వెలికి తీయవచ్చని గతంలోనే అంచనా వేశారు. ఈ మేరకు కొందరికి లీజు అనుమతులు ఇచ్చినా, 1/70 చట్టం నిబంధనలతో వెలికితీత సాధ్యం కాలేదు. అయితే కేవలం ఇసుక తవ్వకాలకే పరిమితం కాకుండా, ఇతర ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాలని టీఎస్‌ఎండీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా గ్రానైట్‌ నిల్వలపై మరోమారు దృష్టి సారించింది.

గత ఏడాది నమూనాలు సేకరించి ఫార్ములేషన్లు విశ్లేషించి, నాణ్యతను పరిశీలించారు. మార్బుల్, గ్రానైట్‌ (డైమన్షనల్‌ స్టోన్‌) క్వారీయింగ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కొందరు ఔత్సాహికులు టీఎస్‌ఎండీసీకి దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం నుంచి నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీగా గుర్తింపు పొందిన టీఎస్‌ఎండీసీ ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో సున్నపు రాయి అన్వేషణలో నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.  

ఆదాయం పెంచుకునేందుకే క్వారీయింగ్‌ 
వివిధ ఖనిజాల మైనింగ్‌ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. 2016–17లో రూ. 3,143 కోట్లు, 2017–18లో రూ.3,704 కోట్లు ఆదాయం రాగా, 2018–19లో సుమారు రూ.4వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే ఇందులో అత్యధికంగా ఇసుక విక్రయాల ద్వారానే రాష్ట్ర ఖజానాకు ఎక్కువగా ఆదాయం వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇసుక విక్రయాల ద్వారా రూ. 2,415 కోట్లు ఖజానాకు సమకూరాయి. 2017–18లో రూ.678 కోట్లు, 2018–19లో రూ.886 కోట్లు ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ప్రస్తుతం గ్రానైట్‌ వెలికితీత ద్వారా కన్సిడరేషన్‌ రూపంలో రూ.50 లక్షల లోపు మాత్రమే టీఎస్‌ఎండీసీకి ఆదాయం వస్తోంది. గ్రానైట్‌ క్వారీయింగ్‌ ప్రణాళిక ఆచరణలోకి వస్తే టీఎస్‌ఎండీసీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా